Share News

విస్తరిస్తున్న స్ట్రాబెర్రీ సాగు

ABN , Publish Date - Oct 17 , 2025 | 10:54 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో స్ట్రాబెర్రీ సాగు విస్తరిస్తున్నది. సంప్రదాయేతర పంటగా స్ట్రాబెర్రీని ఎనిమిదేళ్లుగా గిరిజన రైతాంగం సాగు చేస్తోంది. ఈ ఏడాది కొత్తగా 35 ఎకరాల్లో నాట్లు వేసింది. నవంబరు నాటికి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.

విస్తరిస్తున్న స్ట్రాబెర్రీ సాగు
లంబసింగిలో పండిన స్ట్రాబెర్రీలు (ఫైల్‌)

లంబసింగిలో మరో 35 ఎకరాల్లో నాట్లు

నవంబరు నాటికి దిగుబడులు

పర్యాటకులే కొనుగోలుదారులు

80 శాతం ప్రాంతీయ మార్కెట్‌లోనే విక్రయం

చింతపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే స్ట్రాబెర్రీ పండుతోంది. గులాబీ జాతికి చెందిన స్ట్రాబెర్రీ అమెరికాలో పుట్టింది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో దీనిని అధికంగా సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీలు అన్ని కాలాల్లో పండిస్తున్నప్పటికీ వేసవి మాత్రమే సరైన సీజన్‌. రుచి, పరిమాణం, ఆకారం ఆధారంగా 500 పైబడిన రకాలున్నాయి. లంబసింగి ప్రాంతంలో వింటర్‌డాన్‌ రకాన్ని రైతులు సాగుచేస్తున్నారు. గొందిపాకలు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు బౌడు కుశలవుడు జిల్లాలో తొలిసారిగా 2008లో స్ట్రాబెర్రీ సాగు చేపట్టాడు.

లంబసింగిలో క్రమంగా పెరుగుతున్న విస్తీర్ణం

లంబసింగిలో ఆరేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. అభ్యుదయ రైతు కుశలవుడుని ఆదర్శంగా తీసుకొని మైదాన ప్రాంత రైతులు భూములు లీజుకు తీసుకొని స్ట్రాబెర్రీని సాగు చేపట్టారు. అయితే 2020 నుంచి స్థానిక గిరిజన రైతులు కూడా స్ట్రాబెర్రీ సాగు ప్రారంభించారు. ఈ ఏడాది లంబసింగి, రాజుపాకలు, గొందిపాకలు, సిరిపురం, లబ్బంగి, చీకటిమామిడి, చిట్రాళ్లగొప్పు గ్రామాల్లో 35 ఎకరాల్లో రైతులు స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. నవంబరు పర్యాటక సీజన్‌ నాటికి స్ట్రాబెర్రీలు అందుబాటులోకి వచ్చే విధంగా సెప్టెంబరు మొదటి వారం నుంచి నెలాఖరు వరకు రైతులు నాట్లు వేశారు.

పర్యాటకులే కొనుగోలుదారులు

లంబసింగిలో సాగు చేస్తున్న స్ట్రాబెర్రీలను పర్యాటకులే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. అక్టోబరు రెండో పక్షం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు వేల సంఖ్యలో పర్యాటకులు లంబసింగి అందాలను తిలకించేందుకు తరలి వస్తారు. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు స్ట్రాబెర్రీ తోటలను సందర్శించి, తాజాగా సేకరించిన పండ్లను కొనుగోలు చేసుకొని వెళుతున్నారు. 200 గ్రాముల ప్యాకెట్‌ని స్థానికంగా రూ.60 ధరకు వర్తకులు విక్రయిస్తున్నారు. రైతులు పండించిన స్ట్రాబెర్రీలు 80 శాతం ప్రాంతీయ మార్కెట్‌లోనే అమ్ముడైపోతున్నాయి. కేవలం 20శాతం మాత్రమే రైతులు మైదాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

స్ట్రాబెర్రీలో దండిగా పోషకాలు

బి. దివ్యసుధ, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త,

రాస్‌ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి

స్ట్రాబెర్రీలో 80 రకాల పోషకాలున్నాయి. రోజుకు మూడు చొప్పున తీసుకుంటే 45 క్యాలరీల శక్తితో పాటు ఆరోగ్యానికి అవసరమైన సి-విటమిన్‌, ప్లెవొనాయుడ్‌లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ అన్నది అస్సలు వుండదు. గర్భిణులు రోజు 8 బెర్రీలు తింటే చాలు. వారికి అవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది.

Updated Date - Oct 17 , 2025 | 10:54 PM