టీడీపీ పార్లమెంటు కమిటీపై కసరత్తు
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:30 AM
సంస్థాగత ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం దృష్టిసారించింది.
అధ్యక్ష రేసులో వేపాడ, సుధాకర్, నజీర్, ప్రణవ్‌గోపాల్, రాజబాబు
పార్టీ కార్యాలయంలో రేపు కమిటీ సమావేశం
అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం: గండి బాబ్జీ
విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):
సంస్థాగత ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం దృష్టిసారించింది. కొత్తవారితో అన్ని కమిటీలను ఏర్పాటుచేయాలని అధినేత చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. దీనికి అనుగుణంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నాయకులు, కేడర్‌తో భేటీ నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీలు వేశారు.
విశాఖ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం ఈనెల 26న జరగనున్నది. మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కూడిపూడి సత్తిబాబులతో కూడిన కమిటీ సమావేశానికి హాజరుకానుంది. విశాఖ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, అధినేతకు నివేదిక ఇస్తారు. పార్లమెంటు కమిటీకీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులగా ఎవరు ఉండాలన్నది అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారు. ప్రస్తుతం విశాఖ పార్లమెంటు అధ్యక్షుడిగా గండి బాబ్జీ, ప్రధాన కార్యదర్శిగా పొలమరశెట్టి శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. నగరంలో కొందరు ఎమ్మెల్యేలు గండి బాబ్జీని మార్చాలని గట్టిగా పట్టుబడుతున్నారు. బాబ్జీకి ఎంపీ శ్రీభరత్ సన్నిహితుడిగా పేరుంది. అతని స్థానంలో కొత్తవ్యక్తికి పార్లమెంటు పగ్గాలు అప్పటించాలని అధినేత చంద్రబాబు, గాజువాక ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపై నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారు. బాబ్జీ స్థానంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావును తెరపైకి తీసుకువచ్చారు. అతనికి పదవి ఇస్తే కాపు సామాజికవర్గానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెబుతున్నారు. అయితే దక్షిణ ఇన్‌చార్జి, ఎన్టీఆర్ వైద్య ట్రస్టు వైస్‌చైర్మన్ సీతంరాజు సుధాకర్ అధ్యక్ష రేసులో ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి రాష్ట్రంలో ఏ జిల్లా అధ్యక్ష పదవీ ఇవ్వలేదని ఇప్పటికే అధిష్ఠానం దృష్టిలో పెట్టారు. నగరంలోని ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా కలిశారు. తాజాగా వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ పేరు తెరపైకి వచ్చింది. నగరానికి చెందిన కొందరు నేతలు ప్రణవ్‌పేరు అధిష్ఠానానికి సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్, భీమిలికి చెందిన కోరాడ రాజబాబు రేసులో ఉన్నారు. కాగా బాబ్జీ కూడా పార్టీ అధినేతను కలిశారు. అతని నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పినట్టు తెలిసింది. అఽధ్యక్ష పదవిలో కొనసాగాలని అధినేత నిర్ణయిస్తే శిరసా వహిస్తానని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఎదుట నేతలు, కేడర్ తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.