Share News

సింహాచలం ట్రస్ట్‌ బోర్డుపై కసరత్తు

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:25 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన దేవాలయాలు అన్నింటికీ ట్రస్ట్‌ బోర్డులను నియమిస్తోంది.

సింహాచలం ట్రస్ట్‌ బోర్డుపై కసరత్తు

22 మందికి అవకాశం?

రాష్ట్రంలో ఇతర జిల్లాల వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచన

ఉత్తరాంధ్రాకే పరిమితం చేయాలని ఇక్కడ నేతల విజ్ఞప్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన దేవాలయాలు అన్నింటికీ ట్రస్ట్‌ బోర్డులను నియమిస్తోంది. అందులో భాగంగా సింహాచలం దేవస్థానానికి కూడా ట్రస్ట్‌ బోర్డు వేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తం 22 మందికి అవకాశం కల్పిస్తారని విశ్వసనీయ సమాచారం. దేవస్థానం వార్షిక ఆదాయం రూ.100 కోట్లు దాటితే బోర్డులో రాష్ట్రస్థాయిలో సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలాగే సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డులో సభ్యత్వం కోసం పలువురు ఆరాట పడుతున్నట్టు సమాచారం.

సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డులో ఇప్పటివరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని వారికే అవకాశం కల్పిస్తూ వచ్చారు. శ్రీలక్ష్మీ వరాహనృసింహస్వామి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు సభ్యులను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇతర జిల్లాల వారు కూడా పేర్లు సూచించినట్టు సమాచారం. దీనిని విశాఖ జిల్లా నాయకులు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తుని వరకు పార్టీకి సేవ చేసిన వారిని గుర్తించి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ట్రస్ట్‌ బోర్డులో అవకాశం కోరుకునే వారు తప్పనిసరిగా కూటమి పార్టీల్లో సభ్యత్వం కలిగినవారై ఉండాల్సిందేనని అంటున్నారు.

బోర్డు నియామకం వరకే...సమావేశాలు ఉండకపోవచ్చు

సింహాచలం దేవస్థానానికి అనువంశిక ధర్మకర్త ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. పూసపాటి అశోక్‌గజపతిరాజు ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఇటీవల గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. అది రాజ్యాంగ పదవి. అలాంటి స్థానంలో ఉన్నవారు ఇతర ఏ కార్యకలాపాల్లోను కీలకంగా ఉండకూడదని నిబంధనలు చెబుతున్నాయి. దీనివల్ల ఆయన అక్కడ గవర్నర్‌గా, ఇక్కడ చైర్మన్‌గా కొనసాగడానికి సాంకేతికంగా అవకాశం లేదని అంటున్నారు. ఆయన కూడా ట్రస్ట్‌ బోర్డు నియామకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. గతంలో ట్రస్ట్‌ బోర్డు సభ్యులు కొందరు అంతా తామై వ్యవహరించి, ఆలయ పరిపాలనా వ్యవహారాలకు అడ్డం పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు అవసరం లేదని ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. అయితే పార్టీ అధికారంలో ఉన్నందున ఇలాంటి నియామకాలు అవసరం కాబట్టి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 22 మందితో బోర్డును ఏర్పాటు చేయడానికి ఫైల్‌ సిద్ధం చేశారు.

Updated Date - Sep 28 , 2025 | 12:25 AM