సంపద సృష్టికి కసరత్తు
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:12 AM
జిల్లాలోని చెత్త సంపద కేంద్రాలను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకువచ్చి, ఈ ఏడాది గాంధీ జయంతి నాటికి డంపింగ్ రహితంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతున్నది. దీంతో పంచాయతీరాజ్ యంత్రాంగం అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నది.
రంగంలోకి దిగిన పంచాయతీరాజ్ యంత్రాంగం
ఈ ఏడాది గాంధీ జయంతి నాటికి డంపింగ్ రహితం చేయాలని సర్కారు నిర్ణయం
జిల్లాలో 430 పంచాయతీల్లో 281 చోట్లే చెత్త సంపద కేంద్రాలు
అన్ని పంచాయతీల్లో ఏర్పాటుకు అధికారుల చర్యలు
గడువు నాటికి లక్ష్యం చేరుకుంటాం: సచివాలయాల నోడల్‌అధికారి పీఎస్ కుమార్
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని చెత్త సంపద కేంద్రాలను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకువచ్చి, ఈ ఏడాది గాంధీ జయంతి నాటికి డంపింగ్ రహితంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతున్నది. దీంతో పంచాయతీరాజ్ యంత్రాంగం అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నది. గత ఐదేళ్లుగా చెత్త సంపద కేంద్రాల వినియోగం, పరిసర పరిశుభ్రతపై గత వైసీపీ ప్రభుత్వం కనీసం దృష్టి సారించకపోవడంతో చెత్త సంపద కేంద్రాలు ఎక్కడికక్కడ నిరుపయోగంగా మారాయి.
జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 22 మండలాల్లో 430 గ్రామ పంచాయతీలున్నాయి. వాస్తవానికి ప్రతీ పంచాయతీకి ఒకటి చొప్పున మొత్తం 430 చెత్త సంపద కేంద్రాలుండాలి. కానీ 281 సంపద కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. దీంతో మరో 149 పంచాయతీలకు చెత్త సంపద కేంద్రాలు లేని దుస్థితి నెలకొంది. అలాగే 281 సంపద కేంద్రాల్లో ప్రస్తుతానికి వినియోగంలో ఉన్నవి 121 కాగా, పాక్షికంగా వినియోగంలో ఉన్నవి 153 అయితే 7 కేంద్రాలు వినియోగానికి దూరంగా ఉన్నాయి. మొత్తం 430 పంచాయతీల పరిధిలో ఇప్పటికి పూర్తి స్థాయిలో వినియోగంలో ఉన్నవి 121 మాత్రమే.
రంగంలోకి దిగిన పంచాయతీరాజ్ యంత్రాంగం
స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర పేరిట రాష్ట్రాన్ని డంపింగ్ ఫ్రీగా చేయాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చెత్త సంపద కేంద్రాలను శతశాతం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు పంచాయతీరాజ్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. పంచాయతీల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, సంపద కేంద్రాలు, వాటిని సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దానిని అక్టోబరు రెండో తేదీ నాటికి పూర్తి స్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం క్షేత్ర స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పాడేరు మండలం మినుములూరులోని సంపద కేంద్రాన్ని సందర్శించారు.
గిరిజన ప్రాంతంలో చెత్త సేకరణ, డంపింగ్‌కు అవస్థలు
ఏజెన్సీలో చెత్త సేకరణ, డంపింగ్ వంటి చర్యలు చేపట్టేందుకు పంచాయతీ యంత్రాంగం నానా అవస్థలు పడుతోంది. ముఖ్యంగా మేజర్ పంచాయతీ, మండల కేంద్రాల్లో మినహా మిగతా ప్రాంతాల్లోని పంచాయతీలకు పారిశుధ్య కార్మికులు లేకపోవడం, ప్రభుత్వం ఇచ్చిన రిక్షాలను ఎత్తుపల్లాలున్న ప్రాంతాల్లో వినియోగించలేని పరిస్థితి ఉంది. అక్కడక్కడా రిక్షాలను వినియోగిస్తున్నా, వాటిని మరమ్మతులు చేసే దుకాణాలు గిరిజన ప్రాంతంలో లేకపోవడం సమస్యగా మారింది. అలాగే ప్రతీ పంచాయతీకి ట్రాక్టర్లు వంటి సదుపాయాలు లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న డంపింగ్ యార్డ్ లేదా చెత్త సంపద కేంద్రాలకు చెత్తను తరలించడం కష్టతరంగా మారుతున్నది. ప్రభుత్వం సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయకుండా ప్రతికూల పరిస్థితులున్న గిరిజన ప్రాంతంలోని పరిస్థితులకు అనుగుణంగా పలు విధానాలు అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.
కనీసం పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలను ఆ తరువాత(2019లో) అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. నిర్మించి ఉన్న ఆయా కేంద్రాలను గ్రామ పంచాయతీల ద్వారా నిర్వహించుకున్నా పలు విధాలుగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ వాటిని వినియోగించుకోవాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకపోవడం, స్థానికంగా వాటిని వినియోగంలోకి తీసుకువద్దామనుకున్న పంచాయతీ సర్పంచులకు ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహం లేకుండా పోయింది. దీంతో సర్పంచులు సైతం వాటి వైపు చూసేందుకు సాహసించలేని దుస్థితి నెలకొంది. దీని వల్ల మండల కేంద్రాల్లో నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు ఎక్కడికక్కడ నిరుపయోగంగా ఉండిపోయాయి.