ఉత్సాహంగా విలువిద్య పోటీలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:29 PM
పాడేరులో రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. ఈనెల 7న మొదలైన ఈ పోటీలు 9వ తేదీన ముగియనున్నాయి.
జూనియర్ కాలేజీ మైదానంలో సందడి వాతావరణం
నేడు ముగియనున్న రాష్ట్ర స్థాయి పోటీలు
పాడేరు, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పాడేరులో రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. ఈనెల 7న మొదలైన ఈ పోటీలు 9వ తేదీన ముగియనున్నాయి. రెండో రోజు అండర్-14, 17, 19 విభాగాల్లోని విలువిద్య పోటీలను నిర్వహించారు. రెండు రోజుల్లో క్రీడా కారులు సాధించిన మార్కులు, ప్రతిభ ఆధారంగా ఆదివారం తుది పోటీలను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 572 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. దీంతో పోటీలు నిర్వహిస్తున్న స్థానిక జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో సందడి నెలకొంది. వందల సంఖ్యలోని క్రీడాకారులు, అదే స్థాయిలో కోచ్‌లు, వ్యాయామ సంచాలకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పలువురు ఉపాధ్యాయులతో పాడేరు పట్టణంలో హడావుడి నెలకొంది. అయితే రాష్ట్ర స్థాయి విలు విద్య పోటీలకు పాడేరు వేదిక కావడంపై క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పాంగి సూరిబాబు, భవాని, రాష్ట్ర పరిశీలకుడు నారాయణరావు, డీఎస్‌డీవో జగన్మోహనరావు, ఏపీ అర్చరీ అసోసియేషన్ చైర్మన్ సీహెచ్.సత్యనారాయణ, కార్యదర్శి రమణ, టెక్నికల్ చైర్మన్ శ్రావణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.