ఈడబ్ల్యూఎస్ ప్లాట్లు
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:08 AM
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)ను అధికారులు కరుణించడం లేదు.
దాకమర్రి లేఅవుట్‌లో 304 ప్లాట్లు
లబ్ధిదారులను గుర్తించని యంత్రాంగం
పుష్కర కాలంగా హోల్డింగ్
అర్థం కాని వీఎంఆర్‌డీఏ పెద్దల మనసు
నిర్ణయాధికారం కలెక్టర్‌కు అప్పగించిన బోర్డు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)ను అధికారులు కరుణించడం లేదు. ప్రభుత్వం గతంలో వారికి ప్రత్యేక లబ్ధి కలిగేలా చర్యలు చేపట్టినా, ఆ తరువాత ఉపసంహకరించుకుంది. అయితే అప్పటికే వారి కోసం కేటాయించిన ప్రయోజనాలను అర్హులకు అందించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు.
లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించే రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ వాటిలో కొన్నింటిని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించి, తక్కువ రేటుకు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై రియల్ ఎస్టేట్ సంస్థలు మల్లగుల్లాలు పడ్డాయి. ఖరీదైన లేఅవుట్లు వేస్తామని, అక్కడ ఈడబ్ల్యూఎస్ వర్గాల ఇళ్లుంటే... పెద్ద ప్లాట్లు కొనడానికి ధనికులు ముందుకురారని వాదించాయి. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కచ్చితంగా ప్రయోజనం అందాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో లేఅవుట్లకు దూరంగా ప్లాట్లు ఇస్తామని ఒప్పించారు. ఆ తరువాత వ్యాపారుల ఒత్తిళ్లతో పక్కన పెట్టేశారు.
వీఎంఆర్‌డీఏ (గతంలో వుడా) దాకమర్రిలో జాయింట్ వెంచర్ కింద వెన్సార్ మిడోస్‌తో కలిసి 2013లో 98.84 ఎకరాల్లో లేఅవుట్ వేసింది. అందులో హెచ్‌ఐజీ 183 ప్లాట్లు, ఎంఐజీ 348 ప్లాట్లు, ఎల్‌ఐజీ 250 ప్లాట్లతో పాటు అప్పటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈడబ్ల్యుఎస్ కోసం 304 ప్లాట్లు కేటాయించింది. ఇతర వసతులకు మరో 14 ప్లాట్లు ఉంచారు. మొత్తం 1,163 ప్లాట్లు కాగా అందులో వీఎంఆర్‌డీఏ వాటాగా 941 ప్లాట్లు, డెవలపర్ వెన్సార్ మిడోస్‌కు 322 ప్లాట్లు ఇచ్చారు. దశల వారీగా వేలం నిర్వహించి అమ్ముకున్నారు. అప్పట్లో మార్కెట్ ధర కంటే వీఎంఆర్‌డీఏ ఎక్కువ ధర పెట్టడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఆరు నెలల క్రితం రేటు తగ్గించి కొన్ని ప్లాట్లు విక్రయించారు. గజం ధర రూ.21 వేల నుంచి రూ.15,500కు తగ్గించారు.
అయితే ఈడబ్ల్యుఎస్ కోసం కేటాయించిన 304 ప్లాట్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వాటికి అర్హులను ఎలా ఎంపిక చేయాలనే అంశంపై క్లారిటీ లేదంటున్నారు. ప్రజా ప్రతినిధులు, వీఎంఆర్‌డీఏ చైర్మన్లుగా పనిచేసిన వారు దీనిపై దృష్టి పెట్టలేదు.
కలెక్టర్ లేఖతో కదలిక
ఇదిలావుండగా యుద్ధంలో భర్తను కోల్పోయిన వారికి, దివ్యాంగులుగా మారిన సైనికులకు ఆనందపురం మండలం తంగుడుబిల్లి లేఅవుట్‌లో 20 ప్లాట్లు కేటాయించాలని వీఎఆర్‌డీఏకు ఇటీవల కలెక్టర్ హరేంధిరప్రసాద్ లేఖ రాసినట్టు సమాచారం. ఒక్కొక్కరికి 300 గజాల చొప్పున ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. అయితే అందులో ఇవ్వడానికి వీలు కాదని, దాకమర్రి లేఅవుట్‌లో ఈడబ్ల్యుఎస్ కోసం కేటాయించినవి ఉన్నాయని అప్పటి కమిషనర్ విశ్వనాథన్ ప్రతిపాదించారు. దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచిన మీదట ఖాళీగా ఉన్న ప్లాట్లు కలెక్టర్‌కే అప్పగిస్తామని, వాటిని నిబంధనల ప్రకారం అర్హులకు కేటాయిస్తారని బోర్డుకు ప్రతిపాదించినట్టు తెలిసింది. వాటి విస్తీర్ణం సుమారు 5,500 గజాలు. ఇప్పుడు కమిషనర్ బదిలీ కావడంతో కలెక్టర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్లాట్లు కేటాయించే అధికారం ఆయనకే ఉంది. తక్కువ ధరకు స్థలం అంటే తప్పుడు పత్రాలతో సిద్ధమయ్యేవారు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ప్లాట్ల కేటాయింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అనర్హులకు కేటాయిస్తే వీఎంఆర్‌డీఏ పరువు బజారున పడే ప్రమాదం ఉంది.