Share News

స్ర్తీశక్తికి సర్వం సిద్ధం

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:05 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘స్ర్తీ శక్తి’ (మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం) పథకం అమలుకు విశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

స్ర్తీశక్తికి సర్వం సిద్ధం

  • జిల్లాలో 804 బస్సులు

  • అందులో ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 570

  • పై ఐదు రకాల బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలకు అవకాశం

  • రీజియన్‌లోని ఏడు డిపోల్లోను రేపు మధ్యాహ్నం ప్రారంభోత్సవాలు

ద్వారకా బస్‌స్టేషన్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘స్ర్తీ శక్తి’ (మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం) పథకం అమలుకు విశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజధానిలో శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లాలోని మధురవాడ, వాల్తేరు, మద్దిలపాలెం, విశాఖపట్నం, గాజువాక, స్టీల్‌ సిటీ, సింహాచలం డిపోల్లో ఉచిత రవాణా బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతి డిపోలోను తొలుత ఐదేసి బస్సులను ప్రారంభినున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత షెడ్యూల్‌ ప్రకారం అన్ని బస్సులు రవాణా సేవలందించనున్నాయి.

విశాఖ జిల్లాలో గల ఏడు డిపోల్లో 804 బస్సులు ఉన్నాయి. అందులో ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు 570 ఉన్నాయి. ఈ బస్సులన్నింటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఉచిత రవాణా కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో సుమారు 80 వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, ఉచిత రవాణా ప్రారంభమైన తరువాత ఈ సంఖ్య 1.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచుకోవాలని భావిస్తున్నారు. జిల్లాలోనే కాకుండా దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే మహిళల సంఖ్య కూడా పెరుగుతుందని, అందుకు తగ్గట్టుగా సర్వీసులు కూడా పెంచుకోవలసిన అవసరం ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. పథకం ప్రారంభమైన వారం రోజుల తరువాత రోజువారీ ప్రయాణించే మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. మహిళలకు రవాణా సౌకర్యాలు అందించడంలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ ప్రధాన కార్యాలయ అధికారులు రీజియన్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

అన్ని డిపోల్లోను బస్సులు అందుబాటులో ఉంటాయి

బి.అప్పలనాయుడు, రీజనల్‌ మేనేజర్‌, విశాఖపట్నం

మహిళలకు ఉచిత రవాణా అందించే బస్సులు అన్ని డిపోల్లోను అందుబాటులో ఉంటాయి. ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా వాటిని వినియోగిస్తాం. రీజియన్‌లోని ఏడు డిపోల మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, ట్రాఫిక్‌ మేనేజర్లు మహిళా ప్రయాణికుల డిమాండ్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసి అందుకు అవసరమైన రూట్లలో అదనపు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటారు. మహిళా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నదే ఆర్టీసీ లక్ష్యం.

Updated Date - Aug 14 , 2025 | 01:05 AM