Share News

పెట్టుబడుల సదస్సుకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:23 AM

సీఐఐతో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు శుక్ర, శనివారాలు జరగనున్నది.

పెట్టుబడుల సదస్సుకు సర్వం సిద్ధం

నేడు, రేపు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహణ

నగరానికి చేరుకున్న ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు

సదస్సు ప్రారంభం ముందు రోజే 35 ఒప్పందా... రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

సీఐఐతో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు శుక్ర, శనివారాలు జరగనున్నది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు దేశ, విదేశాల ప్రతినిధులు గురువారమే నగరానికి చేరుకున్నారు. నగరంలో ఎటు చూసినా భాగస్వామ్య సదస్సు కోలాహలం కనిపిస్తోంది. సదస్సుకు ముందు ఒకరోజు ముందు నోవాటెల్‌ వేదికలో 35 ఒప్పందాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో మొత్తం రూ.3.65 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో రూ.2.65 లక్షల కోట్లు కేవలం ఇంధన రంగంలోనివే. వీటి ద్వారా 1.26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

కాగా రెండ ురోజుల సదస్సు జరిగే ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం ఎనిమిది హాళ్లు ఏర్పాట్లుచేశారు. హాలు-5లో ప్రధాన వేదికపై ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్నది. సదస్సుకు సుమారు 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారు. అతిథులకు 700 కార్లు వినియోగిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి హోటళ్ల వరకు వారిని తీసుకురావడానికి 14 బస్సులు ఏర్పాటుచేశారు. అతిథుల కోసం 1,200 గదులను ముందుగానే సిద్ధం చేశారు. అయితే ఈ సంఖ్య రెండు వేలకు పెరిగిందని చెబుతున్నారు. కొందరి కోరిక మేరకు హోమ్‌స్టేలో బస ఏర్పాటు చేశారు. సదస్సులో పాల్గొనేందుకు కొంతమంది పారిశ్రామిక దిగ్గజాలు ఇప్పటికే నగరానికి చేరుకోగా, మరికొందరు శుక్రవారం రానున్నారు.


రీజియన్‌ అభివృద్ధికి న్యూ విజన్‌

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేసిన సీఎం చంద్రబాబు

2047 నాటికి 750 నుంచి 800 బిలియన్‌ డాలర్ల ఆదాయం లక్ష్యం

ఏడు గ్రోత్‌ డ్రైవర్ల ఎంపిక

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

సరికొత్త విజన్‌, యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, భారీ పరిశ్రమల ఏర్పాటు, పరుగులు పెట్టనున్న అభివృద్ధి...ఇదీ విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ డాక్యుమెంట్‌ ధ్యేయం. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విస్తరించిన ఈ రీజియన్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌ను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నీతి ఆయోగ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్‌లో పలు విషయాలపై సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ వివరించారు.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలతో ఏర్పాటుకానున్న రీజియన్‌కు సంబంధించి 2024లో ఆదాయం 52 బిలియన్‌ డాలర్లు కాగా 2032కల్లా 125 నుంచి 135 బిలియన్‌ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించారు. అదే 2047 నాటికి 750 నుంచి 800 బిలియన్‌ డాలర్లకు చేరుకోవాలని నిర్దేశించారు. ప్రస్తుతం రాష్ట్ర జనాభా 5.3 కోట్లు కాగా అందులో ఎకనామిక్‌ రీజియన్‌ జనాభా 31 శాతం, విస్తీర్ణంలో 23 శాతం, జీడీపీలో 30 శాతం ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం 3,230 డాలర్లు కాగా ఈ రీజియన్‌ పరిధిలో 3,170 డాలర్లు ఉంది. అయితే 2032 నాటికి రీజియన్‌ తలసరి ఆదాయం 7,400 డాలర్లు, 2047 నాటికి 42 వేల నుంచి 44 వేల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు.

అభివృద్ధికి ఏడు హబ్‌లు

రీజియన్‌ అభివృద్ధి కోసం మొత్తం ఏడు హబ్‌లను తయారుచేయాలని గుర్తించారు. వస్తువుల ఉత్పత్తి, ఐటీ, ఏఐ ఇన్నోవేషన్‌, గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌, పర్యాటకం, హెల్త్‌, అర్బన్‌ హౌసింగ్‌, మౌలిక వసతుల కల్పలో స్వావలంబన సాధించేలా హబ్‌లు పనిచేయనున్నాయి. మొత్తం ఆరు పోర్టులు, 12 మేజర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాంతాలను ఏర్పాటుచేస్తారు. రీజియన్‌లో 18 వ్యవసాయాభివృద్ధి ప్రాంతాలు, ప్రపంచస్థాయి నర్సరీలు, ఐదు ఫిషింగ్‌ హార్బర్లు, గుడ్లు ఉత్పత్తి కేంద్రాలు వస్తాయి. భోగాపురంలో ఏరో సిటీ, ఐఐఎం సమీపంలో ఎడ్యుకేషన్‌ స్కిల్‌ కేంద్రం, ఆనందపురంలో ఐటీ డేటా సెంటర్‌, విజయనగరంలో కేబుల్‌ ల్యాండ్‌ స్టేషన్‌, కాపులుప్పాడలో ఐటీ, జీసీసీ సెంటర్లు, మధురవాడలో ఐటీ పార్కు, 13 చోట్ల పర్యాటక కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. మూలపేటలో పారిశ్రామిక నగరం, శ్రీకాకుళంలో కొబ్బరి, జీడి తోటల పెంపకం, అనకాపల్లిలో అల్యూమినియం, గ్రీన్‌ హైడ్రోజన్‌, క్లీన్‌ టెక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, బల్క్‌డ్రగ్‌ సిటీ, ఏటికొప్పాక కల్చరల్‌ విలేజ్‌, కాకినాడ, యానాంలో రివర్‌ క్రూయిజ్‌, కాకినాడలో గేట్‌వే పోర్టు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ, జీడితోటల పెంపకంపై ఫోకస్‌ పెడతారు.

Updated Date - Nov 14 , 2025 | 04:25 AM