Share News

స్త్రీ శక్తికి సర్వం సిద్ధం

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:24 PM

సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో భాగంగా స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15న ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభంకానున్న ఈ పథకానికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల 50 వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనున్నది.

స్త్రీ శక్తికి సర్వం సిద్ధం
పాడేరు డిపోలోని ఆర్టీసీ బస్సులు

రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం

జిల్లా వ్యాప్తంగా రూ.2 లక్షల 50 వేల మందికి లబ్ధి

రోజూ 20 వేల మంది ప్రయాణిస్తారని అంచనా

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో భాగంగా స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15న ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభంకానున్న ఈ పథకానికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల 50 వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనున్నది.

జిల్లాలో పాడేరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, శృంగవరపుకోట, అనకాపల్లి డిపోలకు చెందిన సుమారు వంద బస్సులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం రోజూ సుమారు 15 వేల మంది మహిళలు ప్రయాణిస్తుండగా, స్ర్తీ శక్తి పథకం అమలు తరువాత 20 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల 50 వేల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.

అదన పు బస్సుల కోసం ప్రతిపాదనలు

జిల్లాలో ప్రస్తుతం వివిధ డిపోలకు చెందిన వంద వరకు బస్సులు తిరుగుతుండగా, మరో 20 నుంచి 25 బస్సులు అదనంగా అవసరమని అధికారులు భావించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఉదాహరణకు పాడేరులో మొత్తం 45 బస్సులుండగా, ప్రస్తుతానికి 43 బస్సులు ఏజెన్సీతో పాటు విశాఖపట్నం, చోడవరం, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాలకు నడుస్తున్నాయి. వాటిలో 30 పల్లెవెలుగు, 12 ఎక్స్‌ప్రెస్‌, 3 అల్ర్టా డీలక్స్‌ బస్సులు ఉన్నాయి. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో కేవలం పాడేరు డిపోనకే అదనంగా 12 బస్సులు అవసరమని భావిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ప్రయాణాల కంటే స్ర్తీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు. అయితే జిల్లాలో స్ర్తీ శక్తి పథకం అమలుపై గురువారం మధ్యాహ్ననికి ఉన్నతాధికారుల నుంచి ఒక స్పష్టత వస్తుందని తెలుస్తున్నది. శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించిన తరువాత ఒకటి రెండు రోజులు పరిస్థితిని స్వయంగా పరిశీలించి, అప్పుడు అవసరాలు, సమస్యలు, తదితరులను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలను చేపట్టాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

గిరి మహిళలకు ఎంతో ఉపయోగం

మైదాన ప్రాంతాల్లో కంటే గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పలువురు అంటున్నారు. ప్రస్తుతం అధిక ప్రాంతాలకు బస్సు సదుపాయం ఉండడంతో గిరి మహిళలు దీనిని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే గిరిజనులు ఆర్థికంగా కాస్త పేదరికంతో ఉండడంతో ఈ ఉచిత ప్రయాణం కలిసి వస్తుంది. ఏజెన్సీలోని వారపు సంతలకు సైతం అధిక సంఖ్యలో మహిళలే వెళుతుంటారు. ఈ క్రమంలో వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. దీంతో కూటమి ప్రభుత్వం అమలు చేసే స్ర్తీ శక్తి పథకం వారికి వరమనే భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది.

Updated Date - Aug 13 , 2025 | 11:24 PM