చినలబుడు పాఠశాలలో అన్నీ సమస్యలే..
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:30 PM
మండలంలోని చినలబుడు కేంద్రంలోని మండల పరిపత్ పాథమిక పాఠశాలలో సమస్యలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో నీటి సౌకర్యం లేదు. దీంతో ఆర్వో ప్లాంట్ ఉన్నా పనిచేయడం లేదు. రన్నింగ్ వాటర్ లేక మరుగుదొడ్లు మూలకు చేరాయి.
మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు
నీటి సమస్యతో అల్లాడుతున్న విద్యార్థులు, టీచర్లు
టీచర్ల సొంత నిధులతో గేటు, ప్రాంగణం చదును, గ్రీన్‌మేట్
నిరుపయోగంగా ఆర్వో ప్లాంట్
రన్నింగ్ వాటర్ లేక మూతబడిన మరుగుదొడ్లు
అరకులోయ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చినలబుడు మండల పరిషత్ పాఠశాలలో 64 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. ఐదు తరగతులకు మూడు గదులు మాత్రమే ఉండడంతో రెండేసి తరగతులను ఒకే గదిలో బోధిస్తున్నారు. వాతావరణం బాగుంటే వరండాలో ఒక తరగతిని నిర్వహిస్తున్నారు. మరో రెండు భవనాలు శిథిలావస్థలో ఉండడంతో వాటిలో తరగతులను నిర్వహించడం లేదు. పాఠశాలకు మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న భోజనం తయారీకి బయట నుంచి నీటిని తీసుకువస్తున్నారు. కరోనా సమయంలో బోరు బావిలో ఉన్న సబ్‌మెర్సిబుల్ మోటారు అపహరణకు గురైంది. నాటి నుంచి నేటివరకు పాఠశాలకు కొత్త బోరు బావి, మోటారు ఏర్పాటు చేయకపోవడంతో టాయ్‌లెట్స్‌కు రన్నింగ్ వాటర్ లేదు. దీంతో అవి నిరుపయోగం ఉన్నాయి. పాఠశాల హెచ్‌ఎం దుక్కునాయుడు, ముగ్గురు టీచర్లు కలిసి రూ.80 వేలతో పాఠశాల ముందు ఐరన్ గేటు ఏర్పాటుచేశారు. అలాగే ప్రహారీ లేని ప్రాంతంలో తాత్కాలికంగా గ్రీన్‌మేట్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రాంగణాన్ని ఎక్స్‌కవేటర్‌తో చదును చేయించారు. పాఠశాల చుట్టూ తుప్పలు లేకుండా చదును చేయించారు. 2022-23లో నాడు-నేడు పథకం కింద ఆర్వో ప్లాంట్ మంజూరు ఏర్పాటు చేసినా నీటి సదుపాయం లేక నేటి వరకు ప్రారంభించలేదు. ఆర్వో ప్లాంట్‌కు సంబంధించిన సామగ్రి అంతా ఒక తరగతి గదిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చినలబుడు ప్రాథమిక పాఠశాలను మోడల్‌స్కూల్‌గా ఎంపిక చేశారు. మోడల్‌స్కూల్‌గా ఎంపిక చేసినా ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో పాఠశాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.