ప్రతి విద్యార్థి తల్లి పేరున మొక్క నాటాలి
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:31 PM
జిల్లాలో ఈ నెల 10న పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్, టీచర్స్ మీట్(పీటీఎం)లో భాగంగా ప్రతి విద్యార్థి తన తల్లి పేరిట ఒక మొక్క నాటాలని, ప్రతి పాఠశాలలో మెగా పీటీఎంను ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
మెగా పేరెంట్, టీచర్స్ మీట్‌ను ఘనంగా నిర్వహించాలని ఆదేశం
పాడేరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 10న పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్, టీచర్స్ మీట్(పీటీఎం)లో భాగంగా ప్రతి విద్యార్థి తన తల్లి పేరిట ఒక మొక్క నాటాలని, ప్రతి పాఠశాలలో మెగా పీటీఎంను ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. మెగా పీటీఎం నిర్వహణపై సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మెగా పీటీఎంకు విద్యార్థుల తలిదండ్రులను ఆహ్వానించి, విద్యార్థుల విద్యా ప్రమాణాలపై వారికి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, లైబ్రెరీలు వంటి సదుపాయాలను కల్పించాలని, మౌలిక సదుపాయాల కల్పనలో స్థానిక దాతల నుంచి విరాళాలు సేకరించి పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డులు అందించాలని, మార్గదర్శినిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మంగళవారం నుంచి విద్యాలయాలకు మొక్కల పంపిణీ ప్రక్రియ జరగాలన్నారు. మొక్కలు నాటడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి విద్యార్థి తల్లి పేరిట ఒక మొక్క నాటాలన్నారు. మండలాల్లో మొక్కలు నాటించే బాధ్యత తహశీల్దార్లపై ఉందన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మెగా పీటీఎం నిర్వహణకు అన్ని పాఠశాలలకు నిధులు విడుదల చేశామన్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులను మెగా పీటీఎంకు ఆహ్వానించాలన్నారు. విద్యార్థుల కెరీర్ గైడెన్స్‌పై పాఠశాలలు, కళాశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాలచం, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పీవీ సందీప్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మజీరావు, సమగ్ర శిక్షా ఏపీసీ డాక్టర్ ఎ.స్వామినాయుడు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ ఎల్.రజని, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలు పాల్గొన్నారు.