ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా బలోపేతం
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:34 PM
ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.
రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి
పీ4తో జిల్లాలో లక్ష గిరిజన కుటుంబాలకు లబ్ధి
పది కుటుంబాలను దత్తత తీసుకుంటా: మంత్రి
పాడేరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో పీ4 విధానం, స్వర్ణాంధ్ర-2047పై జిల్లా స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీ4 విధానంలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శులు ముందు రావాలనే ముఖ్యమంత్రి ఆలోచన చాలా గొప్పదన్నారు. జిల్లాలో 9 లక్షల జనాభా ఉంటే ఒక లక్ష బంగారు కుటుంబాలున్నాయన్నారు. ఆయా కుటుంబాలను దత్తత తీసుకుని వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. తాను సైతం పది కుటుంబాలను దత్తత తీసుకుని, వారి అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. అలాగే అధికారులు కూడా బంగారు కుటుంబాలకు మేలు చేసేందుకు సంపూర్ణంగా తోడ్పాటు అందించాలన్నారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయమని టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడును కోరామని, అలాగే జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో సుమారు రూ.వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. అర్హులకు అటవీ హక్కుపత్రాలను అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అంతకు ముందు జిల్లాలో పీ4, స్వర్ణాంధ్ర- 2047పై జిల్లా కలెక్టర్ ఏఎన్.దినేశ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2029 నాటికి 15 శాతం వృద్ధిరేటు సాధన దిశగా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పీ4 విధానంపై ముద్రించిన పోస్టర్లను అందరూ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, డివిజనల్ అటవీ అధికారి పీవీ.సందీప్‌రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరిషాదేవి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, విజయనగరం రీజియన్ ఆర్టీసీ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, ఇన్‌చార్జి డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.