Share News

పవర్‌ ప్లాంటు కూడా ప్రైవేటుకు...!

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:45 AM

విశాఖపట్నం స్టీల్‌ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

పవర్‌ ప్లాంటు కూడా ప్రైవేటుకు...!

  • స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం నిర్ణయం

  • థర్మల్‌ పవర్‌ ప్లాంటులో 2/3 నిర్వహణ

  • ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నోటిఫికేషన్‌

  • ఒక్కొక్క విభాగం ప్రైవేటుపరం చేస్తుండడంపై కార్మికుల ఆందోళన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాంటుకు అవసరమైన విద్యుత్‌ను తయారుచేస్తున్న థర్మల్‌ పవర్‌ ప్లాంటులో 2/3వ వంతు ప్రైవేటు నిర్వహణకు ఇస్తామంటూ శనివారం నోటిఫికేషన్‌ ఇచ్చింది.

స్టీల్‌ప్లాంటు యాజమాన్యం గత నాలుగు నెలల నుంచి ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు ఇవ్వడానికి నోటిఫికేషన్లు ఇస్తోంది. తొలుత ప్లాంటులో నాణ్యతను తనిఖీ చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే క్వాలిటీ ఎస్యూరెన్స్‌ అండ్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ను ప్రైవేటుకు ఇస్తామని టెండర్లు పిలిచింది. ఆ విభాగంలో 100 మంది పనిచేస్తున్నారు. ఆ తరువాత ప్లాంటుకు గుండెకాయ వంటి రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ), సింటర్‌ ప్లాంట్లను కూడా ప్రైవేటుకు ఇస్తామని టెండర్లు పిలిచింది. ఈ రెండు విభాగాల్లో సుమారు 750 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిని తప్పించడానికి ప్రణాళిక రూపొందించారు. ఆ తరువాత ప్లాంటులో ఎక్కడ ప్రమాదం జరిగినా తక్షణమే స్పందించే ఫైర్‌ విభాగం ప్రైవేటీకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో 280 మంది పనిచేస్తున్నారు. వారిలో చాలామందిని ఇప్పటికే పక్కనపెట్టారు. ఇప్పుడు తాజాగా థర్మల్‌ పవర్‌ ప్లాంటులో కొంత ప్రైవేటుకు ఇస్తామని ప్రకటించారు.

సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తి

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో 315 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన థర్మల్‌ పవర్‌ ప్లాంటు ఉంది. ఇది కాకుండా వృథా వాయువుల నుంచి మరో 120 మెగావాట్లు ఉత్తత్తి చేస్తారు. మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 435 మెగావాట్లు. ఈ రెండూ పూర్తిస్థాయిలో పనిచేస్తే సొంత అవసరాలకు వాడుకోగా, ఇంకా కొంత మిగులుతుంది. దానిని గ్రిడ్‌కు సరఫరా చేసేవారు. స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రక్రియ తెరపైకి వచ్చిన తరువాత అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ మొదలైంది. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుకు అవసరమైన బాయిలర్‌ బొగ్గు సరఫరా తగ్గిపోయింది. దాంతో సొంత ఉత్పత్తి పడిపోయింది. ఈపీడీసీఎల్‌ నుంచి విద్యుత్‌ తీసుకోవడం మొదలైంది. దానికి నెలకు రూ.80 కోట్ల వరకూ చెల్లించాల్సి వస్తోంది. ఆ బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో థర్మల్‌ పవర్‌ ప్లాంటులో 2/3వ వంతు అంటే 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ప్రైవేటుకు ఇస్తామంటూ శనివారం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈఓఐ) ఇచ్చింది. ఈ టెండర్‌లో ఎవరైనా పాల్గొనవచ్చునని, రేటు వారే కోట్‌ చేయాలని పేర్కొంది. కోల్‌ ప్లాంటు-1, టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ అంతా వారే చూసుకోవాలి. కోల్‌ కన్వేయర్‌ గ్యాలరీలు, కోల్‌ బంకర్‌ గ్యాలరీలు, బాయిలర్లు, టర్బో జనరేటర్లు, యాష్‌ వాటర్‌, యాష్‌ హ్యాండ్లింగ్‌ విభాగం వంటివి వారే నిర్వహించాలి. మొత్తం 210 మెగావాట్లు ఉత్పత్తి నిర్వహణకు ఇస్తే రోజుకు కనీసం 120 మెగావాట్లు కచ్చితంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు. ఎలక్ర్టికల్‌ సెక్షన్‌ ఆపరేషన్‌ మొత్తం వారే చూసుకోవాలి. ఈ టెండర్‌ ఖరారైతే 150 మంది ఉద్యోగులను తగ్గించాల్సి వస్తుందంటున్నారు. ఇలా విభాగాల వారీగా ప్రైవేటుపరం చేస్తుండడంపై కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Aug 17 , 2025 | 12:45 AM