Share News

నిధులు మంజూరైనా రహదారికి మోక్షమేది?

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:12 AM

మండలంలోని పెదకోట నుంచి జాలడ వరకు రహదారి అధ్వానంగా ఉండడంతో సుమారు 80 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

నిధులు మంజూరైనా రహదారికి మోక్షమేది?
గోతులమయంగా ఉన్న పెదకోట- జాలడ రోడ్డు

గోతులమయంగా పెదకోట- జాలడ రోడ్డు

80 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

రూ.9.55 కోట్ల ఉపాధి నిధులు మంజూరు

మూడు నెలల క్రితం నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఇంకా ప్రారంభంకాని పనులు

అనంతగిరి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదకోట నుంచి జాలడ వరకు రహదారి అధ్వానంగా ఉండడంతో సుమారు 80 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో అడుగడుగునా గోతులు ఉండడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.

వాస్తవానికి పెదకోట నుంచి జాలడ వరకు పదమూడేళ్ల క్రితం తారురోడ్డు నిర్మించారు. అప్పటి నుంచి కనీస నిర్వహణ లేదు. భారీ వర్షాల కారణంగా రోడ్డంతా పూర్తిగా కొట్టుకుపోయింది. చాలా చోట్ల భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో నాలుగు పంచాయతీల గిరిజనులు జిల్లా కేంద్రం పాడేరు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే జీనబాడు, పినకోట, పెదకోట, కివర్ల పంచాయతీలకు చెందిన గిరిజనులు జాలడ, వేలమామిడి మీదుగా హుకుంపేట మండలానికి, అక్కడ నుంచి పాడేరుకు సులభంగా చేరుకుంటారు.

నిధులు మంజూరైనా..

పెదకోట నుంచి జాలడకు 11 కిలోమీటర్ల మేర తారురోడ్డు నిర్మాణానికి రూ.9.55 కోట్ల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు మంజూరయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో ప్రజాప్రతినిధులు, అధికారులు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పెదకోట, పినకోట, కివర్ల, జీనబాడు పంచాయతీలోని సుమారు 80 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పెదకోట, కివర్ల పంచాయతీ గిరిజనులకు మరింత సమస్యగా మారింది. ప్రస్తుతం పెదకోట- జాలడ వరకు రోడ్డంతా కంకరరాళ్లు తేలి దారుణంగా తయారైంది.

తరచూ ముంపునకు గురవుతున్న కాజ్‌వే

పెదకోట నుంచి జాలడకు వెళ్లే మార్గమధ్యంలో కుడియా సమీపంలో కాజ్‌వే ఉంది. భారీ వర్షాలు కురిస్తే ఈ కాజ్‌వే ముంపునకు గురవుతోంది. తాజాగా మొంథా తుఫాన్‌ ప్రభావంతో సుమారు వారం రోజులపాటు గెడ్డ ఉధృతంగా ప్రవహించి కాజ్‌వే ముంపునకు గురైంది. దీంతో పెదకోట-కివర్ల పంచాయతీలతో పాటుగా పినకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి నిర్మాణంతో పాటు కాజ్‌వే స్థానంలో వంతెన నిర్మించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:12 AM