Share News

గంజాయి నిర్మూలన అందరి బాధ్యత

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:16 PM

గంజాయి వల్ల సమాజానికి ఎంతో చేటని, దాని నిర్మూలన అందరి బాధ్యత అని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

గంజాయి నిర్మూలన అందరి బాధ్యత
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం

పాడేరు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): గంజాయి వల్ల సమాజానికి ఎంతో చేటని, దాని నిర్మూలన అందరి బాధ్యత అని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై ఈగిల్‌, పోలీస్‌, వ్యవసాయ, అటవీ, ఉద్యానవన, వైద్యారోగ్య, విద్య, ఐసీడీఎస్‌, డ్వామా, డీఆర్‌డీఏ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. కళాశాలల్లో అవగాహన సదస్సులు, డీఅడిక్షన్‌ సెంటర్‌కు ఎంత మంది వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంజాయి సాగు చేసే రైతులు, సరఫరాదారులపై ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి సాగుకు దూరమైన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, స్వయం ఉపాధి పథకాలు, బ్యాంకు రుణాలు, పశువులు, మేకలను మంజూరు చేయాలన్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెల్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని ఆరా తీశారు. గంజాయి నిర్మూలనపై గ్రామ స్థాయిలో బృందాలను ఏర్పాటు చేస్తామని, 15 వేల ఎకరాల్లో కాఫీకి నీడ తోటలు, పండ్ల తోటల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే టెన్త్‌ ఫెయిలైన విద్యార్థులతో సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు కట్టించాలన్నారు. వారపు సంతల్లో గంజాయిపై అవగాహన శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

గంజాయితో లింకులుంటే ఆస్తులు జప్తు

గంజాయి సాగు, రవాణా వంటి వాటితో సంబంధమున్న వారి ఆస్తులను జప్తు చేస్తామని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు. గంజాయి సాగు, రవాణా చేసినా వారి స్థిర, చరాస్థులను జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గంజాయి స్మగ్లర్లకు గిరిజన గ్రామాల్లో ఆశ్రయం కల్పించడం నేరమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 221 గ్రామాల్లో గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహించామని చెప్పారు. ఒక్క మార్చి నెలలోనే 9 మందిపై కేసులు నమోదు చేసి, 782 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, బస్టాండ్లలో పటిష్ఠమైన నిఘా పెట్టామన్నారు. అనంతరం గంజాయి నిర్మూలనపై రూపొందించిన పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కల్పశ్రీ (వర్చువల్‌గా), జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నంద్‌, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, హౌసింగ్‌ ఈఈ బి.బాబు, డీఎస్‌వో వెంకటరావు, ఈగిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రమేశ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:16 PM