Share News

ఈపీడీసీఎల్‌ అత్యుత్సాహం

ABN , Publish Date - May 06 , 2025 | 01:11 AM

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)ను తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)లో విలీనం చేసినా అక్రమాలు ఆగడం లేదు. సొసైటీ చట్టం కింద ఆర్‌ఈసీఎస్‌ ఏర్పాటైంది. అక్కడ వచ్చే లాభాల ఆధారంగా జీతాలు నిర్ణయిస్తారు.

ఈపీడీసీఎల్‌ అత్యుత్సాహం

ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగులకు అడ్డగోలుగా జీతాల పెంపు

ఇప్పుడు 2022 పీఆర్‌సీ వర్తింపు

పాత తీర్మానాల ప్రకారమే చేశామని

అధికారుల బుకాయింపు

కలెక్టర్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా ఉన్నా ఆగని అక్రమాలు

ప్రస్తుతం వాచ్‌మన్‌ జీతం రూ.71,980,

డ్రైవర్‌కు రూ.78,171.

అటెండర్‌కు రూ.90 వేలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)ను తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)లో విలీనం చేసినా అక్రమాలు ఆగడం లేదు. సొసైటీ చట్టం కింద ఆర్‌ఈసీఎస్‌ ఏర్పాటైంది. అక్కడ వచ్చే లాభాల ఆధారంగా జీతాలు నిర్ణయిస్తారు. అందులో ఆర్థిక అక్రమాలు జరిగాయని తేలడంతో మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. సొసైటీని తీసుకువెళ్లి ఈపీడీసీఎల్‌కు అప్పగించింది. ఇప్పుడు అక్కడి ఉద్యోగులకు పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ)-2022 జీతాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేలు పెరుగుతుంది. గతంలో పాలకవర్గం తీర్మానం చేసి జీతాలు పెంచేది. ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు పాలకవర్గం లేదు. ఎలా జీతాలు పెంచారనేదే ప్రశ్న.

ప్రస్తుతం సొసైటీలో పనిచేసే వాచ్‌మన్‌ జీతం నెలకు రూ.71,980. డ్రైవర్‌కు రూ.78,171. అటెండర్‌కు రూ.90 వేలు. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ జీతం రూ.2.35 లక్షలు. ఇలా లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు మొత్తం 120 మంది నెలకు రూ.1.12 కోట్లు జీతం కింద తీసుకుంటున్నారు. వీరు కాకుండా మరో 492 మంది కాంట్రాక్టు పేమెంట్‌ వర్కర్లు ఉన్నారు. వీరికి జీతాల కింద రూ.2.16 కోట్లు చెలిస్తున్నారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేసే వాచ్‌మన్‌ జీతం రూ.7,500 కాగా రెగ్యులర్‌ వాచ్‌మన్‌కు రూ.72 వేలు ఇస్తున్నారు. అంటే పదింతలు ఎక్కువ.

పాత రికమెండేషన్‌ ప్రకారం ఇచ్చేస్తున్నారు

ఈపీడీసీఎల్‌ ఉద్యోగులు ప్రభుత్వ సంస్థకు చెందినవారు. వారికి పే రివిజన్‌ కమిషన్‌ వర్తిస్తుంది. ఆర్‌ఈసీఎస్‌ సహకార సంస్థ. వారికి అటువంటివేమీ లేదు. కానీ గతంలో ఈపీడీసీఎల్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇచ్చినప్పుడల్లా ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌, ఎండీ ఒక తీర్మానం చేసి అక్కడి ఉద్యోగులకు కూడా పీఆర్‌సీ ప్రకారం జీతాలు ఇచ్చేసేవారు. అంతా కుమ్మక్కు కావడం వల్ల ఎవరూ ప్రశ్నించలేదు. ఇన్నాళ్లూ నడిచిపోయింది. అయితే మూడేళ్ల క్రితం ఆర్‌ఈసీఎస్‌ను ఈపీడీసీఎల్‌కు అప్పగించింది. ఆపరేషన్‌ వ్యవహారాలన్నీ ఈపీడీసీఎల్‌ చూస్తోంది. బిల్లులు కూడా వసూలు చేసి అక్కడి ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2022లో పీఆర్‌సీ ఇచ్చింది. అప్పటికే ఆర్‌ఈసీఎస్‌ వ్యవహారాలపై కోర్టు వివాదాలు నడుస్తుండడంతో దాని గురించి అక్కడి ఉద్యోగులు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు స్థానిక నేతలను పట్టుకున్నారు. పాత తీర్మానాల ప్రకారం పీఆర్‌సీని అమలు చేస్తూ జీతాలు ఇచ్చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇందుకు అనకాపల్లి ఎస్‌ఈ ప్రతిపాదనలు పంపడం, విశాఖలోని కార్పొరేట్‌ కార్యాలయం ఆమోదించడం జరిగిపోయింది. ఇంతలో లుకలుకలు మొదలు కావడంతో ఒక అడుగు వెనక్కి వేశారు. అయితే ఇప్పటికే చాలామంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో పెరిగిన జీతాలు పడిపోయాయి. ఎవరూ నోరు విప్పడం లేదు.

అది చట్ట విరుద్ధం

సొసైటీలో అర్హతల ప్రామాణికంగా కాకుండా రాజకీయ సిఫారసులతో ఉద్యోగాలు ఇచ్చారు. ఈపీడీసీఎల్‌లో రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. వీరితో సమానంగా సొసైటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. అందుకని పాత పాలకవర్గం అప్పట్లో చేసిన తీర్మానం ప్రకారం 2022 పీఆర్‌సీ అమలు చేస్తున్నామని నోట్‌ తయారుచేసి, దాని ప్రకారం అందరికీ జీతాలు పెంచేశారు. ఇది కూడా తప్పే. ప్రస్తుతం సొసైటీకి స్వయంగా జిల్లా కలెక్టరే పర్సన్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆమె అందుకు ఎలా అంగీకరించారనేది అర్థం కావడం లేదు. ఆ జిల్లా ఎస్‌ఈ సొసైటీ ఇన్‌చార్జి ఎండీగా వ్యవహరిస్తున్నారు. వారిపై రాజకీయ ఒత్తిళ్లు పెట్టి పీఆర్‌సీ అమలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

తేలుకుట్టిన దొంగల్లా...

పీఆర్‌సీ అమలుపై ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో వివరణ కోరితే, సొసైటీ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, బిల్లులు పెడితే ఎప్పటిలాగే ఇచ్చామని, తమ తప్పు ఏమీ లేదని, ప్రత్యేక ఉత్తర్వులు ఏవీ లేవని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అనకాపల్లి జిల్లా అధికారిని వివరణ కోరితే, కార్పొరేట్‌ కార్యాలయమే జీతాలు విడుదల చేసిందని, తమ ప్రమేయం ఏమీ లేదని, పాత పాలకవర్గం తీర్మానం ఆధారంగా చేసుకొని పీఆర్‌సీ ఇచ్చామని తెలిపారు. జిల్లా స్థాయి సహకార శాఖ అధికారిని దీనిపై ప్రశ్నిస్తే...ఆర్‌ఈసీఎస్‌కు పీఆర్‌సీ వర్తించదని చాలా స్పష్టంగా చెప్పారు.

పదవీ విరమణ వయస్సు పెంపునకు నిరాకరణ

ఇటీవల అనకాపల్లి నేత ఒకరు ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగుల పట్ల ప్రత్యేక ప్రేమ చూపిస్తూ వారికి పదవీ విరమణ వయస్సు 58 నుంచి 62 ఏళ్లకు పెంచాలని సహకార సంస్థకు రాశారు. దీనిపై కమిషనర్‌ చట్టాలన్నీ పరిశీలించి, అలా కుదరదని, ప్రభుత్వ ఉద్యోగుల్లా 62 ఏళ్లు చేయలేమని గత నెలలో ఫైల్‌ వెనక్కి తిప్పి పంపించారు. ఇదే సొసైటీలో అక్రమాలపై విచారణ చేయాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో కోరితే ప్రభుత్వం 51ఏ విచారణకు ఆదేశించింది. ఒక వైపు విచారణ జరుగుతూ, మరో వైపు ఆపరేషన్లన్నీ ఈపీడీసీఎల్‌కు అప్పగించిన నేపథ్యంలో అక్కడి ఉద్యోగులకు పీఆర్‌సీ ఎలా ఇస్తారనేది అర్థం కాని వ్యవహారం. ఈ విషయంలో లోపాయికారీ ఒప్పందాలు భారీగా జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనకాపల్లి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు కూడా చేశారు.

Updated Date - May 06 , 2025 | 01:11 AM