జూన్ నుంచి ఈ-పాస్‌పోర్టులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:06 AM
విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం జూన్ నెల నుంచి ఈ-పాస్‌పోర్టులు జారీ చేయనుందని పాస్‌పోర్టు అధికారిణి విశ్వంజలి గైక్వాడ్ తెలిపారు. అలాగే మొబైల్ వ్యాన్ ద్వారా కూడా పాస్‌పోర్టు సేవలు అందించనున్నామని చెప్పారు. తాజాగా విజయవాడలో ఈ సదుపాయం ప్రారంభించారని, విశాఖపట్నం నుంచి పంపిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించిందన్నారు. వాహనం వచ్చిన తరువాత అది ఏ యే రోజుల్లో ఎక్కడెక్కడ తిరుగుతుందనే విషయం పత్రికా ముఖంగా తెలియజేస్తామన్నారు.

మొబైల్ వ్యాన్ ద్వారా కూడా త్వరలో సేవలు
విదేశాలకు వెళ్లేవారి పాస్‌పోర్టుకు
కనీసం ఆరు నెలలు వ్యాలిడిటీ ఉండాలి
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కేంద్రం
పాస్‌పోర్టు అనేది విలువైన డాక్యుమెంట్...చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి
’’ఆంధ్రజ్యోతి’తో విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు
కార్యాలయం అఽదికారిణి విశ్వంజలి గైక్వాడ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం జూన్ నెల నుంచి ఈ-పాస్‌పోర్టులు జారీ చేయనుందని పాస్‌పోర్టు అధికారిణి విశ్వంజలి గైక్వాడ్ తెలిపారు. అలాగే మొబైల్ వ్యాన్ ద్వారా కూడా పాస్‌పోర్టు సేవలు అందించనున్నామని చెప్పారు. తాజాగా విజయవాడలో ఈ సదుపాయం ప్రారంభించారని, విశాఖపట్నం నుంచి పంపిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించిందన్నారు. వాహనం వచ్చిన తరువాత అది ఏ యే రోజుల్లో ఎక్కడెక్కడ తిరుగుతుందనే విషయం పత్రికా ముఖంగా తెలియజేస్తామన్నారు. ఆమె బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ పాస్‌పోర్టులకు సంబంధించి అనేక విషయాలు వెల్లడించారు. విశాఖపట్నం కార్యాలయం పరిధిలో పది జిల్లాలు ఉన్నాయని, శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు, కేంద్ర పాలిత ప్రాంత యానాంకు కూడా తామే సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పాస్‌పోర్టుల కోసం ఒక కేంద్రం ఏర్పాటుచేశామని చెప్పారు.
ప్రశ్న: ఈ-పాస్‌పోర్టుల జారీ చేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆలస్యానికి కారణం?
జవాబు: దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. హైదరాబాద్, భువనేశ్వర్, నాగపూర్‌లలో ఈ-పాస్‌పోర్టులు ఇస్తున్నారు. తరువాత దశలో విశాఖపట్నం ఉంది. జూన్ నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఈ-పాస్‌పోర్టులే అందిస్తాం. అలాగే రెన్యువల్‌కు వచ్చే వారికి కూడా అవే ఇస్తాం.
ప్ర: ఈ-పాస్‌పోర్టు అంటే..?
జ: పాస్‌పోర్టుపై ఎలక్ర్టానిక్ చిప్ అమర్చి ఇస్తారు. స్కాన్ చేయగానే ఆ వ్యక్తి వ్యక్తిగత సమాచారం, బయోమెట్రిక్ వివరాలన్నీ కంప్యూటర్‌లో డిస్‌ప్లే అవుతాయి. దీనిని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ఫీచర్‌తో తీసుకువస్తున్నారు.
ప్ర: పాస్‌పోర్టు అత్యవసరమైతే ఏమి చేయాలి?
జ: విదేశాలకు అత్యవసరంగా చికిత్సకు లేదా ఇతర కారణాలపై వెళ్లాలనుకునేవారు, అడ్మిషన్ల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పాస్‌పోర్టు అర్జంట్‌గా కావలసి వస్తుంది. అటువంటి వారు వాటికి సంబంధించిన ఆధారాలతో పాటు బుక్ చేసుకున్న విమానం టికెట్ తప్పనిసరిగా సమర్పించాలి. అలా చేస్తే వెంటనే పాస్‌పోర్టు జారీ చేస్తాం. ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు పిల్లలు బాక్సింగ్ పోటీలలో పాల్గొనడానికి విదేశాలకు వెళతామంటే బాక్సింగ్ అసోసియేషన్ ఆ పత్రాలతో దరఖాస్తు చేసింది. వెంటనే ఇచ్చాం.
ప్ర: విదేశీ పర్యటనకు వెళ్లేవారు పాస్‌పోర్టు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జ: విదేశాలకు వెళ్లే వారి పాస్‌పోర్టుకు కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉండాలి. అంటే ఆరు నెలల కంటే తక్కువ సమయంలో అది ఎక్స్‌పైర్ అయిపోతుందనుకుంటే దానిని పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి అలాంటి వాటిని ముందుగానే రెన్యువల్ చేయించుకోవాలి.
ప్ర: పాస్‌పోర్టు పోతే వెంటనే ఇంకోటి జారీ చేస్తారా?
జ: పాస్‌పోర్టు పోయినా, చిరిగిపోయినా దానిని సీరియస్‌గానే పరిగణిస్తారు. పాస్‌పోర్టు అనేది విలువైన డాక్యుమెంట్. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎప్పుడైనా పోతే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు అది దొరకలేదని సర్టిఫికెట్ ఇచ్చిన తరువాత దరఖాస్తు చేస్తే అన్నీ పరిశీలించి కొత్తది జారీ చేస్తాం.
ప్ర: పాస్‌పోర్టు దరఖాస్తు విషయంలో కొత్తగా వచ్చిన నిబంధనలు ఏమైనా ఉన్నాయా?
జ: 2023 అక్టోబరు ఒకటో తేదీ తరువాత పుట్టినవారు ఎవరైనా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తే తప్పనిసరిగా పుట్టిన తేదీ సర్టిఫికెట్ సమర్పించాలి. అలాగే 18 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసినా ఇవ్వాల్సి ఉంటుంది. వారిలో చదువుకున్న వారు ఉంటే ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటాం.
ప్ర: పాస్‌పోర్టులో జీవిత భాగస్వామి పేరు మార్పులు, చేర్పులు ఎలా?
జ: పాస్‌పోర్టులో భర్త లేదా భార్య పేరు చేర్పించాలన్నా, తొలగించాలన్నా పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదంటే ఇద్దరూ కార్యాలయానికి వచ్చి జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాలి. అప్పుడే సాధ్యమవుతుంది.
ప్ర: ఎలమంచిలి, అరకులోయల్లో ఏర్పాటుచేసిన పోస్టాఫీసు పాస్‌పోర్టు కేంద్రాల పరిస్థితి ఏమిటి?
జ: ఎలమంచిలిలో రోజుకు 50 స్లాట్లు ఇస్తుంటే అవి ఫుల్ అయిపోతున్నాయి. అరకులో రోజుకు 40 ఇస్తుంటే... పెద్దగా స్పందన లేదు. అరకులో జనవరిలోనే ప్రారంభించాము. ఈ మూడు నెలల్లో 110 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి.
ప్ర: బాగా డిమాండ్ ఉన్న కేంద్రాలు ఏమిటి?
జ: కాకినాడ, రాజమండ్రి కేంద్రాల్లో రోజుకు 90 స్లాట్లు చొప్పున ఇస్తున్నాము. ఆ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విదేశాలకు పని కోసం వెళుతున్నారు. అందువల్ల అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది.