ఈవోఐలను ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:43 AM
విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ యాజమాన్యాలు ప్రకటించిన ఈవోఐలను ఉపసంహరించుకోవాలని విశాఖ ఉక్కు పోరాట కమిటీ ప్రతినిధులు సీహెచ్ నరసింగరావు, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్ పిలుపునిచ్చారు.
మహా ధర్నాలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు
కూర్మన్నపాలెం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ యాజమాన్యాలు ప్రకటించిన ఈవోఐలను ఉపసంహరించుకోవాలని విశాఖ ఉక్కు పోరాట కమిటీ ప్రతినిధులు సీహెచ్ నరసింగరావు, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్ పిలుపునిచ్చారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆద్వర్యంలో ఆదివారం కూర్మన్నపాలెం జంక్షన్‌లో చేపట్టిన మహాధర్నాలో నరసింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంటు చరిత్ర పోరాటాలతో ముడిపడి ఉందన్నారు. వాటి ఫలితంగా దేశవ్యాప్తంగా పాలక, ప్రతిపక్ష నాయకులు ఉద్యమాన్ని గౌరవిస్తున్నారన్నారు. పాలకులు దానిని తగ్గించాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ది చెబుతారన్నారు. తక్షణమే ఈవోఐలను రద్దు చేయకుంటే ప్రజాగ్రహాన్ని చవిచూస్తారని హెచ్చరించారు.
ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను తప్పారన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, చేస్తున్న వింత ప్రకటనలతో ఉక్కు కార్మికుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఉక్కు యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని సత్వరం పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉపాధి లభిస్తుందని నాటు కారు చౌకగా భూములిచ్చిన నిర్వాసితులను మోసం చేయడం దారుణమన్నారు. ఈవోఐలను తక్షణమే రద్దుచేయాలన్నారు. స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నేత పి.మణి, పోరాట కమిటీ నాయకులు నీరుకొండ రామచంద్రరావు, యు.రామస్వామి, ఎన్.రామారావు, గణపతిరెడ్డి, ఇంటక్ రమణమూర్తి, వి.ప్రసాద్, జె.రామకృష్ణ, దొమ్మేటి అప్పారావు, సీహెచ్ సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.