పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:34 AM
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దీని వల్ల కలిగే లాభాలను అందరూ గ్రహించి స్వచ్ఛాంద్ర- స్వర్ణాంధ్రను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు.
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర అందరికీ స్ఫూర్తి కావాలి
నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి
కలెక్టర్ విజయకృష్ణన్
చోడవరం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దీని వల్ల కలిగే లాభాలను అందరూ గ్రహించి స్వచ్ఛాంద్ర- స్వర్ణాంధ్రను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. శనివారం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్చ దివస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ భవనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక్క రోజుకే పరిమితం కారాదని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ఆమె కోరారు. స్థానిక ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ గ్రామాల్లో ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని, ప్రతి పంచాయతీలో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు చెత్త సేకరించే బండిని తొక్కగా, కలెక్టర్ విజయకృష్ణన్ దానిని తోసి అందరిలో ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, ఎమ్మెల్యే, జేసీ, తదితరులు పట్టణంలో వివిధ దుకాణాల నుంచి ఈ-వ్యర్థాలు సేకరించారు. ఈ- వ్యర్థాల సేకరణ కోసం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం స్థానిక ఆంధ్రాబ్యాంకు జంక్షన్ వద్ద చెత్తను ఎత్తే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని స్వయంగా చెత్తను ఎత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏ ఎస్ అధికారి గిరీశ, జేసీ జాహ్నవి, జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి, మండల ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఎండీవో ఆంజనే యులు, తహసీల్దార్ రామారావు, ఈవోపీఆర్‌డీ మహేశ్, ఎంపీపీ గాడి కాసు, సర్పంచ్ బండి నూకరత్నం, ఈవో నారాయణరావు, మాజీ ఎంపీపీ పెదబాబు, నాయకులు దేవరపల్లి వెంకట అప్పారావు, సకురు కోటేశ్వరరావు, గూనూరు మూలినాయుడు, వివిధ శాఖల అధికారులు, కొత్తూరు బాలికల హైస్కూల్ హెచ్‌ఎం ఐ.వి.రామిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.