వినోదాల వేదిక తాజంగి జలాశయం
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:45 AM
ఆంధ్రకశ్మీర్ లంబసింగికి సమీపంలో ఉన్న తాజంగి జలాశయం పర్యాటకులకు వినోదాన్ని పంచే వేదికగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
అందుబాటులో సాహస క్రీడలు, బోటింగ్
అధిక సంఖ్యలో వస్తున్న పర్యాటకులు
ఐటీడీఏ సహకారంతో స్థానిక గిరిజన యువత నిర్వహణ
చింతపల్లి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగికి సమీపంలో ఉన్న తాజంగి జలాశయం పర్యాటకులకు వినోదాన్ని పంచే వేదికగా ప్రత్యేక గుర్తింపు పొందింది. జలాశయం వద్ద సాహస క్రీడలు, బోటింగ్ అందుబాటులో ఉండడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు లంబసింగికి వస్తున్న పర్యాటకులను తాజంగి జలాశయాన్ని సందర్శించి సాహక క్రీడలతో ఎంజాయ్ చేస్తున్నారు.
పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు లంబసింగిని సందర్శిస్తున్నారు. లంబసింగి వచ్చిన పర్యాటకులు తాజంగి జలాశయాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆంధ్రకశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగి మంచు అందాలను తిలకించేందుకు శీతాకాలం భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. సందర్శకులు కేవలం మంచు అందాలను ఆస్వాదించి వెళ్లిపోకుండా తమ పర్యటన మరింత ఆనందంగా సాగించేందుకు 2019 జనవరిలో గత టీడీపీ ప్రభుత్వం తాజంగి జలాశయం వద్ద జిప్‌లైన్ సాహస క్రీడను ఏర్పాటు చేసింది. కాలక్రమంగా పాడేరు ఐటీడీఏ సాహస క్రీడలను అభివృద్ధి చేసింది. గత ఏడాది నుంచి జలాశయంలో సాహస క్రీడలతో పాటు బోటింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సాహస క్రీడల నిర్వహణ బాధ్యతలను స్థానిక యువతకు ఐటీడీఏ అప్పగించింది. దీంతో కొంత మంది గిరిజన యువకులు ‘పర్యాటక వికాస్’ సొసైటీని ఏర్పాటుచేసుకుని సాహస క్రీడల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. పర్యాటకుల కోసం మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ సదుపాయం ఉంది. జలాశయం పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవడంతో పాటు సందర్శకులకు పర్యాటక వికాస్ సభ్యులు మంచి ఆతిథ్యం అందిస్తున్నారు.
అహ్లాదం పంచుతున్న సాహస క్రీడలు
తాజంగి జలాశయంలో సాహస క్రీడలు పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జలాశయం వద్ద జిప్‌లైన్, ఆర్చరీ, గన్ షూటింగ్, బంగీజంప్, బోటు షికార్ అందుబాటులో ఉన్నాయి. జిప్‌లైన్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. కొండ పైనుంచి జలాశయం పైనుంచి దిగువకు వెళ్లే అనుభూతి చాలా బాగుందని పర్యాటకులు అంటున్నారు. అలాగే పిల్లలు, పెద్దలు సైతం ఆర్చరీ, బంగీజంప్ క్రీడలను ఎంజాయ్ చేస్తున్నారు. జలాశయం వద్ద బోట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్చరీలో ప్రతిభ చూపిన వ్యక్తులకు నిర్వాహకులు మెడల్, రూ.500 నగదు బహుమతినిస్తున్నారు.
గిరిజన నృత్యం థింసా ప్రదర్శన
ఉదయం వేళ పర్యాటక వికాస్ యువత తాజంగి మహిళలతో గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను ప్రదర్శిస్తున్నారు. జలాశయానికి వచ్చిన పర్యాటకులు థింసాను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జలాశయం వద్ద థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నది.
పర్యాటకంతో గిరిజన యువతకు ఉపాధి
తాజంగి జలాశయం వద్ద పర్యాటక అభివృద్ధి సాధించడంతో సాహస క్రీడలు, బోటు షికారు ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి లభిస్తున్నది. సాహస క్రీడలు నిర్వహిస్తున్న పర్యాటక వికాస్ సొసైటీకి చెందిన 20 మంది యువకులు, బోటు షికారు నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న నీటి సంఘం యువత 15 మందికి ఐటీడీఏ వచ్చిన ఆదాయం నుంచి వేతనాలు చెల్లిస్తుంది.
జలాశయానికి ఎలా వెళ్లాలంటే..
తాజంగి జలాశయానికి లంబసింగి జంక్షన్ నుంచి వెళ్లాలి. లంబసింగికి ఏడు కిలో మీటర్ల దూరంలో జి.మాడుగుల- తాజంగి ప్రధాన రహదారికి ఆనుకుని జలాశయం ఉంది. జలాశయానికి వెళ్లేందుకు కేవలం ప్రైవేటు వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత వాహనాల ద్వారా నేరుగా జలాశయానికి చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సు సదుపాయం లేదు. ప్రైవేటు సర్వీసు ఆటోలు, జీపులు అందుబాటులో ఉన్నాయి.
సాహస క్రీడలు, బోటింగ్ ధరలు
తాజంగి జలాశయం వద్ద ఏర్పాటుచేసిన సాహస క్రీడల ధరలను ఐటీడీఏ నిర్ణయించింది. జిప్‌లైన్‌లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.200, ఆర్చరీకి రూ.50(ఐదు సార్లు షూట్ చేయవచ్చు), 30 మీటర్ల ఆర్చరీని రూ.100పెట్టి ఐదు బాణాలు తీసుకుని లక్ష్యం మధ్యలో కొట్టగలిగితే రూ.500 నగదు, మెడల్ ఇస్తున్నారు. గన్ షూటింగ్ రూ.50(ఐదుసార్లు షూట్ చేయవచ్చు), బంగీ జంప్ రూ.30, బోట్ షికారు ఒకరికి రూ.100గా నిర్ణయించారు.