Share News

మహిళల ఉపాధికి భరోసా

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:28 PM

మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వడమే కాకుండా 75 శాతం హాజరు ఉన్న ప్రతి మహిళకు ఉచితంగా కుట్టు మిషన్‌ కూడా అందజేయనుంది.

మహిళల ఉపాధికి భరోసా
కశింకోటలో కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలు (ఫైల్‌)

జిల్లాలో 19 కేంద్రాల్లో ఉచితంగా కుట్టు శిక్షణ

అర్హులకు కుట్టు మిషన్లు పంపిణీ

తొలి విడత శిక్షణ పూర్తి

రెండో విడత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వడమే కాకుండా 75 శాతం హాజరు ఉన్న ప్రతి మహిళకు ఉచితంగా కుట్టు మిషన్‌ కూడా అందజేయనుంది. ఇందులో భాగంగా జిల్లాలో 19 కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.

2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం పేరుతో చేతి వృత్తిదారులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, పరికరాలను సబ్సిడీపై అందజేసింది. తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆదరణ పథకాన్ని అటకెక్కించింది. మహిళలకు కుట్టు శిక్షణ అందించకపోగా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఆదరణ 3.0 పథకం కింద జిల్లాలో 2025 సంవత్సరానికి గాను 19 కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికే తొలి దశ కింద జూన్‌ నుంచి సెప్టెంబరు మాసాంతం వరకు వివిధ మండలాలకు చెందిన 2,268 మంది మహిళలకు మూడు నెలల పాటు కుట్టు శిక్షణ అందజేసి, వారు స్వయం ఉపాధి పొందే విధంగా తీర్చిదిద్దారు. మూడు నెలల శిక్షణలో 75 శాతం హాజరు కలిగిన ప్రతి మహిళకు శిక్షణ పొందినట్టు ద్రువీకరణ పత్రంతో పాటు బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఉచితంగా రూ.6,199 విలువ చేసే కుట్టు మిషన్‌ను అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనకాపల్లి, అచ్యుతాపురం, కశింకోట, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల, పాయకరావుపేట కేంద్రాల్లో కుట్టు శిక్షణ పొందేందుకు బీసీ మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి శిక్షణ పొందారు.

శిక్షణ కోసం రిజిస్ట్రేషన్లు

కుట్టు శిక్షణ పొందేందుకు ఆసక్తి గల మహిళలు మండల అభివృద్ధి కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. దరఖాస్తులు అందిన తరువాత ఆయా మహిళల వివరాలను మ్యాపింగ్‌ చేయడం ద్వారా కుట్టు శిక్షణ శిబిరానికి ఆహ్వానిస్తారు. జిల్లాలో రెండో విడత కింద మరో మూడు వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే రెండో ధశ కుట్టు శిక్షణ శిబిరాలను ప్రారంభించనున్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన ప్రతి బీసీ మహిళ సద్వినియోగం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్‌ ఈడీ జ్యోతిశ్రీ కోరారు.

Updated Date - Oct 25 , 2025 | 11:28 PM