Share News

బాలల ఆరోగ్యానికి భరోసా

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:52 PM

బాలల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ రాష్ట్రీయ బాల్‌ స్వాస్థ్య(ఆర్‌బీఎస్‌కే) కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికీ హెల్త్‌ కార్డులు అందించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

బాలల ఆరోగ్యానికి భరోసా
ఏజెన్సీలోని ఒక పాఠశాలలో బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది(ఫైల్‌)

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, పాఠశాలల్లో విద్యార్థులకు హెల్త్‌ కార్డులు

జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్ల లోపు ఉన్న 3,27,279 మందికి పంపిణీ చేసేందుకు చర్యలు

అందరికీ ఆరోగ్య పరీక్షలు, వ్యాధులుంటే అవసరమైన వైద్య సేవలు

జిల్లాలో ఇప్పటికే 2,80,809 మందికి ఆరోగ్య పరీక్షలు

వీరిలో 69,223 మందికి ఆరోగ్య సమస్యలున్నట్టు ప్రాథమికంగా గుర్తింపు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

బాలల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ రాష్ట్రీయ బాల్‌ స్వాస్థ్య(ఆర్‌బీఎస్‌కే) కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికీ హెల్త్‌ కార్డులు అందించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్లు లోపు ఉన్న బాలలను గుర్తించి వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో గుర్తించిన ఆరోగ్య సమస్యలను సదరు హెల్త్‌ కార్డులో నమోదు చేస్తారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మూడు కేటగిరీల్లో హెల్త్‌ కార్డులను అందిస్తున్నారు. వాటిలో ఐదేళ్ల కాలం ఆయా బాలల ఆరోగ్యానికి సంబంధించిన సమస్త సమాచారం అందులో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో బాలల గత ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, పరీక్షల ద్వారా ప్రస్తుత స్థితిగతులను నిర్ధారించడం, వెరసి బాలలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్‌ కార్డులు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్రీయ బాల్‌ స్వాస్థ్య జిల్లా ప్రోగామ్‌ అధికారి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.ప్రతాప్‌ తెలిపారు.

2,80,809 మందికి ఆరోగ్య పరీక్షలు

జిల్లాలో బాలలకు హెల్త్‌ కార్డులు అందించే ప్రక్రియలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లోని బాలలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 3,286 అంగన్‌వాడీ కేంద్రాల్లోని లక్షా 28 వేల 287 మంది చిన్నారుల్లో ఇప్పటికే లక్షా 21 వేల 336 మందికి శవైద్య పరీక్షలు నిర్వహించగా, 28 వేల 861 మందికి ఆరోగ్య సమస్యలున్నట్టు గుర్తించారు. అలాగే 2,908 పాఠశాలల్లోని లక్షా 97 వేల 992 మంది విద్యార్థులకు గాను లక్షా 59 వేల 483 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే, 40 వేల 362 మందికి ఆరోగ్య సమస్యలున్నాయని నిర్ధారణ అయింది. దీంతో ఆయా చిన్నారుల ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా అవసరమైన వైద్య సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పాడేరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, అరకులోయ, చింతపల్లి ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగానే అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లోని విద్యార్థులకు స్వల్ప అనారోగ్య సమస్యలతోపాటు శస్త్ర చికిత్సల స్థాయికి చెందిన వైద్య సేవలను సైతం ప్రభుత్వం అందిస్తున్నది. అయితే చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యం పట్ల వారి తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:52 PM