పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో నైపుణ్యం పెంపు
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:29 AM
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కీలకమైన శిక్షణ కార్యక్రమాలకు కేంద్రంగా మారుతోంది.
ఎంపిక చేసిన 500 మంది గెజిటెడ్ అధికారులకు శిక్షణ
ఐఐఎంతో ప్రభుత్వ ఒప్పందం
సమర్థ పాలన, ఆదాయ వనరుల నిర్వహణ, సమర్థమైన బడ్జెట్ రూపకల్పన వంటి అంశాలపై మరింత అవగాహన కల్పించే దిశగా కార్యకమం
తొలి దశలో 50 మందికి శిక్షణ ప్రారంభం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కీలకమైన శిక్షణ కార్యక్రమాలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో మహిళా శాస్త్రవేత్తలకు విభిన్నమైన అంశాలపై శిక్షణ ఇచ్చిన ఐఐఎం...తాజాగా రాష్ట్ర ప్రభుత్వంలోని గెజిటెడ్ ఉద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఐఐఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు చెందిన సుమారు 500 మంది గెజిటెడ్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నది. నాయకత్వ, నిర్వహణ, అభివృద్ధి శిక్షణ కార్యక్రమం పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. నాయకత్వ నైపుణ్యాలు, సమర్థమైన పాలనా పద్ధతులు అనుసరించడం, డిజిటల్ టూల్స్‌ను వినియోగించి పరిపాలనను అందించడం, భాగస్వామ్య నిర్ణయాలను తీసుకోవడం ద్వారా సుస్థిరమైన గ్రామీణాభివృద్ధి సాధన...తదితర అంశాలపై అధికారులకు ఐఐఎంకు చెందిన నిపుణులు శిక్షణ ఇస్తారు.
ఈ శిక్షణ ఎవరికి?
మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో ఎంపిక చేసిన 500 మంది గెజిటెడ్ అధికారులకు దశల వారీగా ఆరు నెలల్లో శిక్షణ ఇచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఒక్కో దశలో 50 నుంచి 100 మంది ఉద్యోగులు పాల్గొంటారు. తొలిదశ శిక్షణ కార్యక్రమం ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైంది. ఇందులో 50 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.
కీలకమైన అంశాలపై పట్టు
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌లో కీలకమైన సంస్కరణలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సిద్ధమవుతున్నారు. అధికారులకు అందుకు అనుగుణమైన నైపుణ్యాలను నేర్పించాలనే ఉద్దేశంతోనే ఈ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీల ఆదాయ వనరుల నిర్వహణ, సమర్థమైన బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన కీలక సూత్రాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే గ్రామ స్వరాజ్, స్వామిత్వా, సర్వీస్ ప్లస్, భారత్ నెట్, మిస్ వంటి సాధనాలను వినియోగించి సేవలను పారదర్శకంగా ప్రజలకు అందించడం ఎలాగో శిక్షణలో తెలియజేయనున్నారు. పంచాయతీరాజ్ కార్యకలాపాల కోసం బడ్జెటింగ్, ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, హెచ్‌ఆర్ నిర్వహణ పద్ధతులపైనా అవగాహన కల్పించనున్నారు. డ్రాఫ్టింగ్, డేటా విశ్లేషణ, సేవల బదిలీల్లో ఏఐ సాధనాల వినియోగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించనున్నారు. ప్రజారోగ్యం, విద్య, పారిశుధ్యం, వాటర్ మేనేజ్‌మెంట్, విపత్తుల సమయంలో సన్నద్ధం కావడం, పునరుత్పాదక ఇంధన మార్గాలపై దృష్టిసారించడంలో పంచాయతీల పాత్రను తెలుసుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఐఐఎం అధికారులు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ఆరు నెలలకు సంబంధించిన ప్రణాళికగా ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం
జిల్లాలో నేటి నుంచి ప్రారంభం
గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి బాధ్యతలు
ప్రత్యేకించి యాప్ రూపకల్పన
ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక కోసం
ఇప్పుడు సేకరించే సమాచారమే ఆధారం
విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే)కు సిద్ధమైంది. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఇందుకు ఒక యాప్ రూపొందించింది. సోమవారం నుంచే సర్వే ప్రారంభించాలని అనుకున్నా కాలేదు. మంగళవారం నుంచి సచివాలయాల సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతంలో ఇళ్లకు వెళ్లనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల సర్వేల పేరిట ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించింది. అయినా మరోమారు ప్రతి కుటుంబానికి సంబంధించి సమాచారం సేకరించేందుకు సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల 12వ తేదీలోగా ఈ సర్వే పూర్తిచేయాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. పేరుకు తగ్గట్టుగానే ప్రతి కుటుంబ సమగ్ర సమాచారాన్ని నమోదుచేస్తారు. కుటుంబ సభ్యుల సామాజిక, విద్య, ఉద్యోగ సంబంధ సమాచారం, ఆధార్, ఫోన్ నంబర్లు, ఆదాయం, ఆస్తుల వివరాలు సేకరిస్తారు. ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయడంతోపాటు ఈకేవైసీ చేయిస్తారు. ఈకేవైసీ పూర్తయిన తరువాతే ఆ కుటుంబానికి సంబంధించి సర్వే ముగిసినట్టు భావించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈకేవైసీ విషయంలో ఒక మెలిక పెట్టారని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకుందాం. వారిలో ఒకరు ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉంటే...తొలుత స్థానికంగా ఉన్న వారి వివరాలను మాత్రమే సర్వేలో నమోదుచేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తి వివరాలను విడిగా నమోదుచేస్తారు. ఈ నిబంధన కొంతవరకూ ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నందున దూరంగా ఉన్న వ్యక్తుల వివరాల నమోదు కోసం నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలుకు ఈ సమాచారం ఆధారంగా తీసుకుంటారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందజేయడానికి అనుగుణంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఒకటి కొత్తగా జారీచేస్తారు. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఇప్పటికే సచివాలయాల సిబ్బందికి శిక్షణ పూర్తిచేశారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే సచివాలయాల సిబ్బందికి పూర్తి వివరాలు అందజేసి సహకరించాలని గ్రామ/వార్డు సచివాలయాల విభాగాధికారి ఉషారాణి కోరారు.