జలపాతంలో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:14 PM
పుట్టినరోజు వేడుక జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి గురువారం తారాబు జలపాతానికి వచ్చిన ఓ బీటెక్ విద్యార్థి గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు.
పుట్టినరోజు వేడుక జరుపుకునేందుకు
స్నేహితులతో కలిసి వచ్చి ప్రమాదం బారిన...
పెదబయలు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పుట్టినరోజు వేడుక జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి గురువారం తారాబు జలపాతానికి వచ్చిన ఓ బీటెక్ విద్యార్థి గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీనికి సంబంధించి పెదబయలు ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన గొన్నూరు కిశోర్ (22) విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 25న అతని పుట్టినరోజు కావడంతో తోటి విద్యార్థులు లోకవరపు చంద్రశేఖర్, పాడి శామ్యూల్, కమ్మనేని సంతోశ్‌లతో కలిసి బుధవారం రాత్రి అరకులోయ వచ్చాడు. అక్కడ ఓ లాడ్జిలో బస చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అంతా కలిసి తారాబు జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగారు. జలపాతం సందర్శన అనంతరం మళ్లీ రాత్రి అరకులోయ వెళ్లి కేక్ కట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే జలపాతంలో స్నానం చేయడానికి దిగిన కిశోర్ గల్లంతయ్యాడు. అతని కోసం స్నేహితులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రమణ తెలిపారు.