ఇంజనీరింగ్ సీట్లు... విద్యార్థుల పాట్లు
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:10 AM
‘‘ఎంవీపీ కాలనీకి చెందిన శ్వేత ఈసీఈలో చేరాలని భావించింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌లో ప్రముఖ కాలేజీలను ఎంపిక చేసుకుంది. రెండు విడతలు కౌన్సెలింగ్ పూర్తయ్యే సమయానికి సీటు రాకపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా ఎంపిక చేసుకున్న ఒక కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటాలో చేరేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఏడాదికి రూ.1.8 లక్షలు చొప్పున ఫీజు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. సీటు కన్ఫార్మ్ చేసుకునేందుకు తొలి విడత రూ.40 వేలు చెల్లించింది. ఒరిజనల్ సర్టిఫికెట్లను యాజమాన్యానికి ఇచ్చింది.
తొలి రెండు విడతల కౌన్సెలింగ్‌లో సీట్లు రాని పలువురికి మూడో విడతలో కేటాయింపు
మరోవిడత కౌన్సెలింగ్ ఉంటుందని తెలియక మేనేజ్‌మెంట్ కోటాలో చేరేందుకు సిద్ధమైన కొందరు విద్యార్థులు
కాలేజీల యాజమాన్యాలకు అడ్వాన్స్‌ల చెల్లింపు
ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా అందజేత
...ఇప్పుడు అవి వెనక్కి ఇచ్చేందుకు ససేమిరా
అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘‘ఎంవీపీ కాలనీకి చెందిన శ్వేత ఈసీఈలో చేరాలని భావించింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌లో ప్రముఖ కాలేజీలను ఎంపిక చేసుకుంది. రెండు విడతలు కౌన్సెలింగ్ పూర్తయ్యే సమయానికి సీటు రాకపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా ఎంపిక చేసుకున్న ఒక కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటాలో చేరేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఏడాదికి రూ.1.8 లక్షలు చొప్పున ఫీజు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. సీటు కన్ఫార్మ్ చేసుకునేందుకు తొలి విడత రూ.40 వేలు చెల్లించింది. ఒరిజనల్ సర్టిఫికెట్లను యాజమాన్యానికి ఇచ్చింది. అయితే ఇటీవల నిర్వహించిన మూడో విడత కౌన్సెలింగ్‌లో శ్వేతకు ప్రముఖ కాలేజీలో ఈసీఈ సీటు వచ్చింది. మేనేజ్‌మెంట్ కోటాలో సీటు ఇచ్చేందుకు సర్టిఫికెట్లు తీసుకున్న కాలేజీ యాజమాన్యం...ఒక పట్టాన వాటిని తిరిగి ఇవ్వలేదు. దీంతో శ్వేత ఏడాది ఫీజు (రూ.1.8 లక్షలు)ను చెల్లించి తన సర్టిఫికెట్లను తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎంతోమంది విద్యార్థులు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.’’
ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి రెండు విడతల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సీట్లు రాని ఎంతోమంది విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోటాలో చేరేందుకు కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడు కున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లిం చడంతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోవడంతో ఉన్నత విద్యా మండలి మూడో విడత కౌన్సెలింగ్‌ను నిర్వ హించింది. మొదటి రెండు విడతల్లో నిర్వ హించిన కౌన్సెలింగ్‌లో సీట్లు రాని ఎంతోమంది విద్యార్థులు మూడో విడత కౌన్సెలింగ్‌లో తాము కోరుకున్న కాలేజీల్లో, నచ్చిన బ్రాంచీల్లో సీట్లు దక్కించుకున్నారు.అయితే అప్పటికే మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో చేరేందుకు సిద్ధమైన విద్యార్థులకు కొత్త చిక్కు వచ్చిపడింది. కన్వీనర్ కోటాలో సీట్లు రాలేదన్న ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ కోటాలో చేరే క్రమంలో ఎంతోమంది ఆయా కాలేజీలకు కొంత మొత్తం ఫీజును అడ్వాన్స్‌గా చెల్లించడంతోపాటు సర్టిఫికెట్లను ఇచ్చేశారు. ఇప్పుడు కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చాయని చెప్పి ఆయా కాలేజీలకు వెళ్లి సర్టిఫికెట్లు అడుగుతుంటే ఇచ్చేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో చేరి, ఇప్పుడు వేరొకచోట సీటు వచ్చిందని వెళ్లిపోతే తాము నష్టపోతామని వాదిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీల యాజమాన్యాలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు దక్కించుకున్నా వేలాది రూపా యలు చెల్లించాల్సి రావడంతో ఇటు విద్యార్థులు, మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చి వెళ్లిపోయే పరిస్థితి రావడంతో అటు యాజమాన్యాలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, సర్టిఫికెట్లు ఇవ్వ కుండా ఇబ్బంది పెట్టకూడదని, ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.