Share News

ఇన్‌చార్జిల పాలనలో దేవదాయ శాఖ

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:11 AM

జిల్లా దేవదాయ శాఖను అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి మూడేళ్లు దాటినప్పటికీ దేవదాయ శాఖలో పాలన గాడిన పడలేదు. కీలక పోస్టుల్లో ఇన్‌చార్జిలు వుండడంతో ఆలయాలపైన పర్యవేక్షణ కొరవడింది. ఆలయాలకు చెందిన భూములకు కౌలు సక్రమంగా వసూలు కావడం లేదు.

ఇన్‌చార్జిల పాలనలో దేవదాయ శాఖ
అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో నడుస్తున్న దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం

మూడు గ్రేడుల్లో 13 ఈవో పోస్టులు

ప్రస్తుతం ఉన్నది ఏడుగురే!

ఆఫీస్‌ సబార్డినేట్‌, గుమస్తా పోస్టుల్లో భారీగా ఖాళీలు

మొత్తం పోస్టులు 26.. ఇప్పుడున్నది ముచ్చటగా ముగ్గురు!

ఆలయాలు, ఆస్తులపై కొరవడిన పర్యవేక్షణ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లా దేవదాయ శాఖను అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి మూడేళ్లు దాటినప్పటికీ దేవదాయ శాఖలో పాలన గాడిన పడలేదు. కీలక పోస్టుల్లో ఇన్‌చార్జిలు వుండడంతో ఆలయాలపైన పర్యవేక్షణ కొరవడింది. ఆలయాలకు చెందిన భూములకు కౌలు సక్రమంగా వసూలు కావడం లేదు.

జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో 720 ఆలయాలు ఉన్నాయి. వీటిల్లో 118 ఆలయాలకు పండుగలు, పర్వదినాల సందర్భంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన వాటిని గ్రూపు దేవాలయాల పరిధిలోకి చేర్చారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో దేవాలయాలు ఉన్నప్పటికీ వీటి పర్యవేక్షణకు తగినంతమంది అధికారులు లేరు. గ్రేడ్‌-1 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (ఈఓలు) ఒకరు, గ్రేడ్‌-2 ఈవోలు నలుగురు, గ్రేడ్‌-3 ఈవోలు ఎనిమిది మంది.. మొత్తం 13 మంది ఈవోలు వుండాలి. కానీ ప్రస్తుతం ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఆరు ఈవో పోస్టులు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి. ఒక అధికారి రెండు, మూడు ఆలయాలకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడం వల్ల దేవదాయ శాఖలో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఆలయ భూముల పర్యవేక్షణ, పరిరక్షణ తలకు మించిన భారంగా మారుతున్నది. పాయకరావుపేట, చోడవరం, కశింకోట గ్రూపు దేవాలయాలను ఒక ఈవో చూస్తున్నారు. అనకాపల్లి గ్రూపు దేవాలయాల ఈఓ.. నక్కపల్లి గ్రూపు దేవాలయాలను కూడా పర్యవేక్షించాల్సి వస్తున్నది. మునగపాక, ఎలమంచిలి, రాంబిల్లి, నర్సీపట్నం గ్రూపు దేవాలయాల పర్యవేక్షణను ఎలమంచిలి ఈవో చూస్తున్నారు. రావికమతం, వడ్డాది, మాడుగులకు చెందిన గ్రూపు దేవాలయాల బాధ్యతలు చోడవరంఈవో అదనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఈవో కార్యాలయాలకు 13 మంది గుమస్తాలు, 13 మంది ఆఫీస్‌ సబార్డినేట్‌లు వుండాలి. కానీ అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం ఈవో కార్యాలయాల్లో గుమస్తాలు మాత్రమే వున్నారు. ఒక్కచోట కూడా ఆఫీస్‌ సబార్డినేట్‌ లేరు. మొత్తం మీద 13 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు, 10 గుమస్తా పోస్టులు రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి.

అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో జిల్లా కార్యాలయం!

జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయాన్ని అనకాపల్లి రింగ్‌రోడ్డు జంక్షన్‌ సమీపంలోని ఒక అపార్టుమెంట్‌ రెండో అంతస్థులో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్‌లు, ఒక సూపరింటెండెంట్‌, టైపిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్‌లు వుండాలి. కానీ ప్రస్తుతం ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, ఒక గుమస్తా మాత్రమే ఉన్నారు. సహాయ కమిషర్‌ కేఎల్‌ సుధారాణికి అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె వారంలో రెండు రోజులు ఆ జిల్లా వ్యవహారాల పర్యవేక్షణకు వెళుతున్నారు.

Updated Date - Aug 30 , 2025 | 01:11 AM