స్టేషన్‌లో ఎండ్ ప్లాట్‌ఫారం
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:42 AM
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో హౌరా స్టేషన్‌లో మాదిరిగా ‘ఎండ్ ప్లాట్‌ఫారం’ నిర్మించనున్నామని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా తెలిపారు.
72 మీటర్ల వెడల్పున కారిడార్ (ఎయిర్ కాంకోర్స్) నిర్మాణం
ప్రయాణికులు ఓవర్ బ్రిడ్జి ఎక్కాల్సిన అవసరం లేకుండా ఏ ప్లాట్‌ఫారంపైకి అయినా వెళ్లేందుకు అవకాశం
కేకే లైన్‌కు రక్షణ కల్పిస్తాం
కొండ చరియలు విరిగి పడకుండా ఐరన్ నెట్లు ఏర్పాటు
విశాఖ-పలాస ట్రాక్‌కు ఫెన్సింగ్
రైళ్ల వేగం 130 కి.మీ. నుంచి 160 కి.మీ.కు పెంపు
జీఎం కార్యాలయం కోసం రెండు, మూడు భవనాల పరిశీలన
విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో హౌరా స్టేషన్‌లో మాదిరిగా ‘ఎండ్ ప్లాట్‌ఫారం’ నిర్మించనున్నామని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా తెలిపారు. ప్రయాణికులు ఓవర్ బ్రిడ్జి ఎక్కాల్సిన అవసరం లేకుండా దాదాపు 72 మీటర్ల వెడల్పున ఎయిర్ కాంకోర్స్ (కారిడార్) నిర్మిస్తామన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ స్టేషన్‌లో ప్రయాణికులు ఒకటో నంబరు ప్లాట్‌ఫారం నుంచి ఇతర ప్లాట్‌ఫారాలకు ఆ కారిడార్‌లో నడుచుకుంటూ వెళ్లిపోవచ్చునన్నారు. దానికి ఇరువైపులా షాపులు, క్యాంటీన్లు, ఇతర వస్తువులు విక్రయించే దుకాణాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా ఇక్కడి స్టేషన్‌లో దిగే ప్రయాణికులు భవిష్యత్తులో మెట్రో రైలు కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇదే కారిడార్ (ఎయిర్ కాంకోర్స్) నుంచి ఆ స్టేషన్‌కు వెళ్లే ఏర్పాటు కూడా ఉంటుందన్నారు. దీనికి సంబంధించి మెట్రో ప్రాజెక్టు అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు.
కొత్తవలస-కిరండూల్ (కేకే) రైలు మార్గంలో వర్షాకాలంలో కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు తరచూ అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు పలు చర్యలు చేపట్టినట్టు విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ భారీగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఐరన్ నెటు ్ల(ఇనుప వలలు) పెడుతున్నామన్నారు. పెద్ద పెద్ద రాళ్లు పడినప్పుడు వాటిని నెట్లు ఆపలేకపోయినా నష్టం కొంత మేర తగ్గుతుందన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కేవలం మట్టి కొట్టుకు వచ్చి పేరుకుపోతున్నదని, అక్కడ రిటైనింగ్ వాల్స్ (రక్షణ గోడలు) నిర్మిస్తున్నామన్నారు. ఈ చర్యల వల్ల కొంత వర్జ రైలు మార్గానికి రక్షణ కలుగుతుందన్నారు.
పెట్రోలింగ్ సిబ్బందికి జీపీఎస్‌లు
ఎత్తైన కొండ ప్రాంతాల్లో పనిచేసే గ్యాంగ్ మెన్ (పెట్రోలింగ్ సిబ్బంది)కు ఎలా పని చేయాలనే అంశంపై ఇటీవల డార్జిలింగ్‌లో శిక్షణ ఇచ్చామన్నారు. కొండ ప్రాంతాల్లో పనిచేసే వారికి జీపీఎస్ పరికరాలు ఇస్తామన్నారు. వారికి ఎక్కడైనా ట్రాక్ ప్రమాదకరంగా ఉన్నట్టు కనిపిస్తే ఆ పరికరం ద్వారా తమ ఉన్నతాధికారికి తెలియజేస్తారని, సాయం అవసరమైతే రెండో బటన్ నొక్కి ఇతర పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇస్తారని, రైళ్ల రాకపోకలు ఆపేయాల్సిన పరిస్థితి ఉన్నట్టయితే మూడో బటన్ నొక్కి రెండు వైపులా స్టేషన్ల అధికారులను అప్రమత్తం చేస్తారన్నారు. ఆ విధంగా జీపీఎస్‌లను రూపొందించామన్నారు. వీటి వల్ల ప్రమాదాలు తగ్గుతాయని డీఆర్‌ఎం అభిప్రాయపడ్డారు.
రైళ్ల వేగం 130 నుంచి 160 కి.మీ.
విశాఖపట్నం నుంచి దువ్వాడ మీదుగా పలాస వరకు రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా ఫెన్సింగ్ (ప్రహరీ గోడలు) నిర్మిస్తున్నామని, దీనివల్ల పశువులు, గొర్రెలు వంటివి ట్రాక్‌పైకి రాకుండా ఉంటాయన్నారు. దీంతో ఆ లైన్‌లో ప్రస్తుతం 130 కి.మీ. వేగంతో నడుస్తున్న రైళ్లను 160 కి.మీ. వేగంతో నడిపే అవకాశం కలుగుతుందన్నారు.
జీఎం కార్యాలయం కోసం
రెండు, మూడు భవనాల పరిశీలన
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణం ముడసర్లోవలో జరుగుతున్నదని, జనరల్ మేనేజర్ కోసం రెండు, మూడు భవనాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. సిరిపురం వీఎంఆర్‌డీఏకు చెందిన ది డెక్‌లో ఒక అంతస్థు అడిగామన్నారు. అలాగే స్టేషన్‌కు సమీపంలో నిర్మించిన గతి శక్తి భవనాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు.
కాంట్రాక్టర్‌కు పనుల అప్పగింత
విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేశామని, అవి ఇకపై వాయువేగంతో జరుగుతాయన్నారు. అనుకున్న గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు.