Share News

బీచ్‌రోడ్డులో ఆక్రమణల దందా!

ABN , Publish Date - Mar 10 , 2025 | 12:55 AM

(విశాఖపట్నం, ఆంరఽధజ్యోతి) బీచ్‌రోడ్డులో ఆక్రమణలు యథేచ్చగా సాగిపోతున్నాయి. పార్కింగ్‌ కోసం జీవీఎంసీ కేటాయించిన స్థలాల్లో దుకాణాలు ఏర్పాటుచేసేసి, అక్కడ ప్రజాప్రతినిధుల ఫొటోలు పెట్టి మరీ ఇతరులకు లీజుకి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.

బీచ్‌రోడ్డులో  ఆక్రమణల దందా!

  • జీవీఎంసీ పార్కింగ్‌ స్థలాల్లో భారీషెడ్‌ల నిర్మాణం

  • పెద్దఎత్తున దుకాణాల ఏర్పాటు

  • వ్యాపారులకు లీజుకు ఇస్తున్న వైనం

  • పట్టించుకోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

(విశాఖపట్నం, ఆంరఽధజ్యోతి)

బీచ్‌రోడ్డులో ఆక్రమణలు యథేచ్చగా సాగిపోతున్నాయి. పార్కింగ్‌ కోసం జీవీఎంసీ కేటాయించిన స్థలాల్లో దుకాణాలు ఏర్పాటుచేసేసి, అక్కడ ప్రజాప్రతినిధుల ఫొటోలు పెట్టి మరీ ఇతరులకు లీజుకి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్రమణదారులకు భారీగా ఆదాయం సమకూరుతున్నా, జీవీఎంసీ ఖజానాకు ఒక్క రూపాయి కూడా జమ కావడం లేదు. పైగా ఈ స్థలాలు ఒక్కొక్కటిగా ఆక్రమణలకు గురవుతుండడంతో బీచ్‌రోడ్డులో పార్కింగ్‌ సమస్య తలెత్తుతోంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బీచ్‌రోడ్డులో ఆక్రమణలకు అడ్డుకట్టపడడం లేదు. కొంతమంది దళారీలు జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బీచ్‌రోడ్డులో ఖాళీస్థలాలు, పార్కింగ్‌ స్థలాల్లో దుకాణాలను ఏర్పాటుచేస్తున్నారు. వాటిజోలికి ఎవరూ రాకుండా తమకు అస్మదీయులైన ప్రజాప్రతినిధుల ఫొటోలను అక్కడ ఏర్పాటుచేస్తున్నారు. తర్వాత వాటిని వ్యాపారులకు అద్దెలకు ఇచ్చి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

వాహనాలకు పార్కింగ్‌ కరవు...

బీచ్‌రోడ్డులో రోజురోజుకీ ఆక్రమణలు పెరిగిపోతుండడంతో బీచ్‌కు వచ్చే సందర్శకులు, పర్యాటకులకు ఇబ్బందికరంగా మారుతోంది. మరోవైపు పార్కింగ్‌ స్థలాల్లో దుకాణాలను ఏర్పాటు చేస్తుండడంతో వాహనాలను రోడ్డుపైనే నిలిపేస్తున్నారు. ఇది బీచ్‌రోడ్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారడంతోపాటు ట్రాఫిక్‌ జామ్‌లకు దారితీస్తోంది. దీనిపై జీవీఎంసీ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదులు అందుతుండడంతో ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు జీవీఎంసీ, పోలీస్‌శాఖ అధికారులు పలుమార్లు ప్రకటించినా ఆచరణలోకి రావడంలేదు. తాజాగా బీచ్‌రోడ్డులో అమీబాపార్కు, సిల్వర్‌స్పూన్‌ రెస్టారెంట్‌ మధ్య ఉన్న పార్కింగ్‌ స్థలంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఒకరు భారీగా షెడ్‌ను ఏర్పాటుచేశారు. దానిచుట్టూ కొందరు రాజకీయనేతల ఫొటోలు పెట్టి అటువైపు అధికారులు ఎవరూ రాకుండా జాగ్రత్తపడ్డారు. షెడ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత దానిని వేరొకరి అద్దెకు ఇచ్చేయడంతో అందులో ప్రస్తుతానికి హైదరాబాదీ హలీమ్‌హౌస్‌ పేరుతో దుకాణం ప్రారంభించారు. అదే షెడ్‌లో హైదరాబాద్‌ బిర్యానీ పేరుతో కూడా విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. దీనిపై కొందరు శనివారం జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులు హడావుడిగా షెడ్‌లపై ఉన్న బోర్డులను, షెడ్‌ముందు ఏర్పాటుచేసిన కార్పెట్‌లను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

గోకుల పార్కు సమీపంలో...

అదేమాదిరిగా బీచ్‌రోడ్డు గోకులపార్కు పక్కన తీరం వైపు సీపెరల్‌ క్యాంటీన్‌ పక్కనే ఉన్న పార్కింగ్‌ స్థలంలో మరొకరు రాత్రికి రాత్రే భారీషెడ్‌లు ఏర్పాటుచేశారు. జీవీఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండానే అందులో వ్యాపారాలను కూడా ప్రారంభించేశారు. షెడ్‌ పరిసరాల్లోకి అధికారులెవరూ రాకుండా కూటమి నేతల ఫొటోలను ఏర్పాటుచేశారు. దీనిపై కూడా కొందరు శనివారం ఫిర్యాదు చేయడంతో షెడ్‌చుట్టూ ఏర్పాటుచేసిన నేతల ఫొటోలను తొలగించేశారు.

చర్యలపై తాత్సారమెందుకో?

జీవీఎంసీ అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటుచేస్తే తక్షణం చర్యలు తీసుకోవాల్సిన జీవీఎంసీ అధికారులు ఎందుకు అటువైపు చూడడం లేదనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా పార్కింగ్‌కు కేటాయించిన స్థలాను ఇష్టారాజ్యంగా ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేస్తే బీచ్‌రోడ్డుకు వచ్చే సందర్శకులతో పాటు ఆయా దుకాణాలకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేసుకుంటారనే దానిపై అధికారులు దృష్టిసారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జీవీఎంసీ, పోలీస్‌శాఖల అధికారులు సంయుక్తంగా ఆక్రమణలపై కొరడా ఝుళిపించాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Mar 10 , 2025 | 12:55 AM