చినముషిడివాడలో చెరువు కబ్జా
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:37 AM
నగర శివారు పెందుర్తిలో భూముల విలువ గణనీయంగా పెరగడంతో చెరువులను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు.
తప్పుడు పత్రాలతో తెగబడుతున్న ఆక్రమణదారులు
రెవెన్యూ సిబ్బంది సహకారంతోనే నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు
పెందుర్తి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
నగర శివారు పెందుర్తిలో భూముల విలువ గణనీయంగా పెరగడంతో చెరువులను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. చెరువు స్థలమా..అయితే మాకేంటి? అంటూ అక్రమార్కులు ఆక్రమణలకు తెగబడుతున్నారు. ఆక్రమిత స్థలాల్లో తప్పుడు పత్రాలతో యథేచ్ఛగా పక్కా నిర్మాణాలు చేపడుతూ రెవెన్యూ శాఖకు సవాల్ విసురుతున్నారు.
పెందుర్తి రెవెన్యూ మండలం చినముషిడివాడ సర్వే నంబరు 70లో సుమారు 18 ఎకరాల చెరువు ఉంది. చినముషిడివాడ ప్రధాన రహదారి సమీపంలోని చాణక్యనగర్ శివారు కిశోర్ లేఅవుట్ మీదుగా ఎఫ్‌సీఐ గోదాం వరకు ఈ చెరువు విస్తరించి ఉంది. కాలక్రమంలో చెరువు సమీప భూములు లేఅవుట్ మీదుగా మారడంతో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. స్థలాల విలువ రూ.కోట్లకు ఎగబాకింది. ఈ క్రమంలో వ్యవసాయ భూములకు ఆనుకుని ఉన్న ఈ చెరువుపై ఆక్రమణదారుల కన్నుపడింది. చెరువు పరిసర ప్రాంతంలో లేఅవుట్లు ఉండటంతో గజం స్థలం విలువ సుమారు రూ.40 వేలుగా ఉంది. దీంతో కొందరు సిండికేట్ అయ్యి ఈ చెరువు స్థలాలను కబ్జా చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. చెరువును ఆనుకుని ఉన్న జిరాయితీ సర్వే నంబర్ వేసి తప్పుడు పత్రాలు సృష్టించి కొంతకాలంగా ఆక్రమణలకు తెర తీశారు. ఇలా ఆక్రమించిన స్థలాల్లో పక్కా నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే ఇవి కొందరి చేతులు మారి విక్రయాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఆక్రమించి విక్రయాలు జరపడం సర్వసాధారణమైంది. ఇక్కడ నిర్మాణాలను ఆక్రమణలుగా నిర్ధారించి కొట్టేసినా, కొంతకాలం ఆగి మళ్లీ కట్టేస్తున్నారని, రెవెన్యూ కింది స్థాయి సిబ్బంది సహకారంతోనే నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సుమారు ఆరు ఎకరాల చెరువు స్థలం పరాధీనమైందని, ఇందులో నిర్మాణాలు చేపట్టారని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.
తాజాగా ఇదే తరహాలో ఇక్కడి స్థలాన్ని సుమారు రెండొందల గజాలు ఆక్రమించి నిర్మాణానికి సిద్ఢపడటంతో ఈ ఆక్రమణపై తహశీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు రావడంతో చెరువు ఆక్రమణల సంగతి వెలుగులోకి వచ్చింది. చెరువు స్థలాన్ని ఆక్రమించి శ్లాబ్ వేసినా రెవెన్యూ అధికారుల్లో కదలిక లేదు. చెరువులను జీవీఎంసీకి బదలాయింపు జరిపామని, వీటి పరిరక్షణ బాధ్యత వారిదేనని రెవెన్యూ వారు అంటున్నారు. ఇక్కడ పట్టణ ప్రణాళిక అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా.. కాసుల కక్కుర్తితో టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు మేల్కొనకపోతే మిగిలివున్న రూ.కోట్ల విలువైన చెరువు స్థలం కూడా పరాధీనమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా చినముషిడివాడలోని చెరువును సర్వే చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తుండడం ఆక్రమణదారుల్లో గుబులు రేపుతోంది.
ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు
-ఇంటి వెంకట అప్పారావు, పెందుర్తి తహశీల్దార్
చినముషిడివాడ సర్వే నంబర్-70లో చెరువు స్థలం ఆక్రమణకు సంబంధించి సర్వే చేపడతాం. చెరువుల పరిరక్షణ బాధ్యతను జీవీఎంసీకి బదలాయించిన నేపథ్యంలో ఆక్రమణల విషయాన్ని వారికి లేఖ ద్వారా తెలియపరిచాం. అక్రమ నిర్మాణాలను తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం.