Share News

బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సాహం

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:32 AM

బిందు, తుంపర్ల సేద్యానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. రైతులకు 90 శాతం రాయితీపై పరికరాలు అందిస్తోంది. దీనిపై రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సాహం
సబ్బవరం మండలం నల్లరేగులపాలెంలో తుంపర సేద్యం పరికరాల వినియోగం

బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సాహం

- జిల్లాలో 2 వేల హెక్టార్లలో సాగు లక్ష్యం

- రాయితీపై పరికరాలు అందజేత

- ఉద్యాన పంటల సాగుపై రైతుల ఆసక్తి

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

బిందు, తుంపర్ల సేద్యానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. రైతులకు 90 శాతం రాయితీపై పరికరాలు అందిస్తోంది. దీనిపై రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

తక్కువ నీటి వినియోగంతో సాగు పెట్టుబడి వ్యయం తగ్గించుకొని, నాణ్యమైన అధిక పంటల దిగుబడులు సాధించగలిగే బిందు, తుంపర సేద్యాన్ని 2014-19 మధ్య అధికారంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులకు రాయితీలు అందించి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిందు, తుంపర సేద్యం చేసే రైతులను నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బిందు, తుంపర సేద్యాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. దీంతో రైతులు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏటా కేవలం 8 వందలు నుంచి 9 వందల హెక్టార్ల మధ్యలోనే బిందు, తుంపర సేద్యం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 2025-26 సంవత్సరంలో రూ.16.32 కోట్ల అంచనా వ్యయంతో ఏకంగా 2 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు జిల్లా సూక్ష్మ నీటిసాగు పథకం అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశాలతో రాయితీపై వ్యవసాయ, ఉద్యాన పంటలకు బిందు, తుంపర సేద్యం పరికరాలను రైతులకు అందజేయనున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 1,581 మంది రైతులు 1,606.29 హెక్టార్లకు రాయితీ పరికరాలు పొందేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జిల్లాలో సాధారణంగా రైతులు సాగు చేసే ఉద్యాన పంటలైన మామిడి, కొబ్బరి, చెరకు, బొప్పాయి, అరటి, జామ, దానిమ్మ, వంకాయ, టమాటా వంటి కూరగాయల పంటలకు బిందు సేద్యం రాయితీ పరికరాలు అందజేయనున్నారు. ఈ ఏడాది జిల్లాలో కూరగాయల పంటల సాగు చేసే రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాలో అనకాపల్లి, రావికమతం, సబ్బవరం, కోటవురట్ల, నక్కపల్లి, గొలుగొండ, దేవరాపల్లి, కె.కోటపాడు, పరవాడ మండలాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉన్నందున ఆయా మండలాలతో పాటు మిగిలిన మండలాల్లోనూ బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు రైతులకు రాయితీపై అందించేందుకు ఏపీఎంఐపీ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరికరాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఆరు మైక్రో ఇరిగేషన్‌ కంపెనీలకు అనుమతులు జారీ చేసింది. ఆయా కంపెనీల ప్రతినిధులు అర్హత పొందిన రైతు క్షేత్రంలో పరికరాలను అమర్చనున్నారు.

రాయితీతో పరికరాలు

బిందు, తుంపర సేద్యం కింద సాగు చేసే రైతులకు ప్రభుత్వం 90 శాతం రాయితీతో పరికరాలు అందిస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ రైతులైతే శత శాతం రాయితీ ఇస్తుంది. ఒక రైతుకు గరిష్టంగా రూ.2.18 లక్షల వరకు పరిమితం చేశారు. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు 90 శాతం రాయితీ అందుతుంది. ఐదు ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య సాగుకు 70 శాతం రాయితీ అందుతుంది. ఒక రైతుకు గరిష్టంగా రూ.3.10 లక్షలు వరకు పరిమితం చేశారు. పెద్ద రైతులు అంటే 10 ఎకరాలకు పైగా సాగు చేసే రైతుకు 50 శాతం రాయితీపై గరిష్టంగా ఒక రైతుకు రూ.4 లక్షలు వరకు పరిమితం చేసి పరికరాలు అందిస్తున్నారు. తుంపర సేద్యం కింద స్ర్పింకర్లను అన్ని వర్గాల చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం రాయితీ అందనుంది.

Updated Date - Jul 12 , 2025 | 12:33 AM