ఏటికొప్పాక హస్తకళలకు ప్రోత్సాహం
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:07 AM
ఏటికొప్పాక లక్కబొమ్మలు తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని, ఇటువంటి హస్తకళను మరింత ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రెండో రోజైన మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మునిసిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖలపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
లక్కబొమ్మల తయారీకి అవసరమైన అంకుడు చెట్ల పెంపుపై దృష్టి సారించాలి
కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
జిల్లాలో పలు శాఖలపై సమగ్ర నివేదికలను సమర్పించిన కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏటికొప్పాక లక్కబొమ్మలు తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని, ఇటువంటి హస్తకళను మరింత ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రెండో రోజైన మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మునిసిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖలపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీ, హస్త కళాకారులను ప్రోత్సహించే అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ఏటికొప్పాక బొమ్మలను, వాటిని తయారు చేసే కళాకారులను ప్రోత్సాహాన్ని అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఏటికొప్పాకలో బొమ్మల తయారీకి ఉపయోగించే అంకుడు చెట్లు బాగా తగ్గిపోవడంతో కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని, అంకుడు చెట్ల పెంపుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే ఎలమంచిలి, ఏటికొప్పాక, కోటవురట్ల పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో అంకుడు విత్తన సేకరణ జరిగిందని తెలిపారు. నర్సరీల్లో అంకుడు మొక్కలను పెంచి, ప్రభుత్వ భూముల్లో నాటించి చెట్ల పెంపకానికి చర్యలు చేపడతామన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి అటవీ చట్టాలు అడ్డంకిగా మారాయని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. అటవీ భూముల్లో అంకుడు చెట్ల నుంచి కర్ర సేకరణకు, ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి అనుమతుల కోసం కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో చేపడుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, అటవీ, మునిసిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖలపై సమగ్ర అభివృద్ధి నివేదికలను కలెక్టర్ విజయకృష్ణన్ సమర్పించారు.