ఎన్‌కౌంటర్‌తో కలకలం
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:14 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి స్థానికంగా చర్చనీయాంశమైంది.
అల్లూరి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన అరుణ తల్లిదండ్రులు కరకవానిపాలెంలో నివాసం
ఉలిక్కిపడ్డ పెందుర్తి
మహిళా మావోయిస్ట్ అరుణ ఎన్‌కౌంటర్
పెందుర్తి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి):
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆమె తల్లిదండ్రులు లక్ష్మణరావు, అర్జునమ్మ పెందుర్తి మండలం గొరపల్లి పంచాయతీ పరిధి కరకవానిపాలెంలో నివాసం ఉంటున్నారు. లక్ష్మణరావు ఇరవై ఏళ్ల క్రితం భార్య, ముగ్గురు పిల్లలతో కరకవానిపాలెం వచ్చారు. ఆయన ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆయనకు స్థానికంగా మంచి పేరుంది. లక్ష్మణరావు, అర్జునమ్మ దంపతుల పెద్ద కుమార్తె అరుణ. ఇరవై ఏళ్ల వయసులో ఆమె ఉద్యమంలోకి వెళ్లినట్టు చెబుతున్నారు. అరుణ భర్త చలపతి ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ ఈ ఏడాది జనవరి నెలలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ఇప్పుడు అరుణ చనిపోయారు. ఆమె తలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కుమారుడు గోపి అలియాస్ ఆజాద్ యాక్షన్ టీమ్ సభ్యునిగా ఉంటూ 2016లో కొయ్యూరు మండలం మర్రిపాకలు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. మరో కుమార్తె ఝాన్సీ న్యాయవాది. ఆమె భర్తతో పాటు కరకవానిపాలెంలో ఉంటున్నారు. గతంలో కుమారుడు, ఇప్పుడు కుమారై ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో ఆ కుటుంబం విషాదంలో ఉంది.