‘ఉపాధి’ కూలీలకు ఊరట
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:22 AM
వేతనాల కోసం మూడు నెలల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధి కూలీలకు ఎట్టకేలకు కూలి డబ్బులు అందనున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆయా కూలీల బ్యాంకు/ పోస్టల్ ఖాతాలకు వేతనాల సొమ్ము జమకానున్నది.
ఎట్టకేలకు అందనున్న వేతన బకాయిలు
జిల్లాలో రూ.59 కోట్లు పెండింగ్
ఈ ఏడాది జనవరి మూడో వారం నుంచి కూలీలకు ఆగిన చెల్లింపులు
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పలుమార్లు ఆందోళనలు
నిధులు విడుదల చేసినట్టు ఐదు రోజుల క్రితం కేంద్రం ప్రకటన
రెండు, మూడు రోజుల్లో కూలీల ఖాతాల్లో డబ్బులు జమ
చోడవరం/ నర్సీపట్నం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): వేతనాల కోసం మూడు నెలల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధి కూలీలకు ఎట్టకేలకు కూలి డబ్బులు అందనున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆయా కూలీల బ్యాంకు/ పోస్టల్ ఖాతాలకు వేతనాల సొమ్ము జమకానున్నది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ ఏడాది జనవరి మూడో వారం నుంచి గత శనివారం (19వ తేదీ) వరకు రూ.59 కోట్లు పెండింగ్‌లో వున్నాయి.
అనకాపల్లి జిల్లాలో 2.82 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,10,239 కుటుంబాలకు పనులు కల్పించారు. గత ఏడాది డిసెంబరు వరకు రూ.350 కోట్లు వేతనాలుగా కూలీలకు చెల్లించారు. సంక్రాంతి తరువాత ఉపాధి పనులు మళ్లీ మొదలయ్యాయి. కానీ కూలీలకు ఇంతవరకు ఒక్కసారి కూడా వేతనాలు అందలేదు. వ్యవసాయ పనులు సైతం లేకపోవడంతో ఉపాధి పనులే ఆధారం అయ్యాయి. కానీ మూడు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాల నేతల ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు వేతనాల కోసం తరచూ వినూత్న రీతుల్లో నిరసనలు తెలుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు నెలలపాటు వేతనాలు పెండింగ్‌లో వుండడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే.. కొద్ది రోజుల్లోనే నిధులు విడుదల అవుతాయంటూ రెండు నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో పలువురు కూలీలు పనులకు రావడం మానేశారు. మొత్తం మీద ఉపాధి కూలీల బకాయిలు రూ.59 కోట్లు వున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీల వేతనాల కోసం రాష్ట్రానికి రూ.912 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఐదు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో కూలీలు ఊరటచెందారు. కూలీల బ్యాంకు ఖాతాలకు జమ కావడానికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని డ్వామా అధికారులు అంటున్నారు. ఇంత సుదీర్ఘకాలం వేతనాలు అందకపోవడం ఇదే ప్రథమమని చెబుతున్నారు.