వెదురుతో గిరిజనులకు ఉపాధి
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:29 AM
గిరిజన ప్రాంతంలో పేదలైన గిరిజనులకు తుల్డా రకం వెదురుతో జీవనోపాధి కల్పించేందుకు వెలుగు, జాతీయ ఉపాధి హామీ పథకం సంయుక్త ఆధ్వర్యంలో వెదురు ప్రాజెక్టును అమలు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
రెండు వేల కుటుంబాల జీవనోపాధికి ప్రత్యేక చర్యలు
జిల్లాలో పాడేరు, డుంబ్రిగుడ, మారేడుమిల్లి, వై.రామవరం మండలాలు ఎంపిక
అగర్తలకు చెందిన తుల్డా రకం వెదురు పెంపకం ప్రారంభం
వెలుగు, ఉపాధి హామీ విభాగాల ఆధ్వర్యంలో వెదురు ప్రాజెక్టు అమలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గిరిజన ప్రాంతంలో పేదలైన గిరిజనులకు తుల్డా రకం వెదురుతో జీవనోపాధి కల్పించేందుకు వెలుగు, జాతీయ ఉపాధి హామీ పథకం సంయుక్త ఆధ్వర్యంలో వెదురు ప్రాజెక్టును అమలు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లాలో ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో రెండు వేల గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.
గిరిజన ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరుగుతున్న క్రమంలో వినూత్నంగా వెదురుతో తయారు చేసిన వస్తువుల విక్రయం ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా ఎక్కువగా పర్యాటకులు వచ్చే పాడేరు, డుంబ్రిగుడ, మారేడుమల్లి, వై.రామవరం మండలాల్లో వెదురు ప్రాజెక్టును అమలు చేయనున్నారు.
తుల్డా రకం వెదురు పెంపకానికి చర్యలు
వెదురు ప్రాజెక్టులో భాగంగా వివిధ రకాల వస్తువులు, ఉత్పత్తుల తయారీకి అనువుగా ఉండే తుల్డా రకం వెదురు పెంపకంపై అధికారులు శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా మారేడుమల్లిలో వెయ్యి మందికి, వై.రామవరంలో 300, పాడేరులో 300, డుంబ్రిగుడలో 400 మంది గిరిజన రైతులకు 60 చొప్పున తుల్డా వెదురు మొక్కలను అందించారు. రెండేళ్ల పాటు వాటిని పెంచి, ఆ తరువాత నుంచి వెదురు కర్రలను సేకరించి, వాటితో అవసరమైన వస్తువులు తయారు చేసి విక్రయించుకోవచ్చు. అలాగే ఈ రెండేళ్ల పాటు వాటిని పెంచేందుకు గానూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులైన గిరిజన రైతులు పెద్ద భారం లేకుండానే ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం దక్కుతుంది. అయితే ఏజెన్సీలో లభ్యమయ్యే వెదురు మందంగా ఉండడంతో పాటు వాటి రేకులతో వస్తువుల తయారీకి అనువుగా ఉండదు. దీంతో అగర్తల ప్రాంతంలో లభ్యమయ్యే తుల్డా రకం వెదురు మొక్కలను రప్పించి స్థానిక గిరిజన రైతులకు పంపిణీ చేశారు.
మారేడుమిల్లిలో వెదురు ప్రోసెసింగ్ యూనిట్
రంపచోడవరం డివిజన్ పరిధిలోని మారేడుమల్లిలో తుల్డా వెదురు ప్రోసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు ఎకరం విస్తీర్ణంలో రూ.50 లక్షల వ్యయంతో ప్రోసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. రానున్న రెండేళ్లలో మొక్కల పెంపకం, యూనిట్ ఏర్పాటు, తదితర పనులను పూర్తి చేసి రెండేళ్ల అనంతరం ప్రతి లబ్ధిదారుడికి చక్కని ఆదాయం వచ్చేలా చేయాలనేదే తమ లక్ష్యమని అధికారులు అంటున్నారు.