Share News

ఉపాధి పనుల అక్రమాలపై ఉద్యోగులపై వేటు

ABN , Publish Date - Aug 22 , 2025 | 10:51 PM

మండలంలోని బలపం పంచాయతీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యాన పంటల సాగులో జరిగిన అక్రమాలపై ఆరుగురు ఉద్యోగులపై వేటు పడింది.

ఉపాధి పనుల అక్రమాలపై ఉద్యోగులపై వేటు

ఆరుగురు ఉద్యోగులు సస్పెన్షన్‌..

ఒకరికి షోకాజు నోటీసు

రూ.19.57లక్షలు రికవరీకి డ్వామా పీడీ ఆదేశం

డ్రాగన్‌ ఫ్రూట్‌ ప్రోత్సాహక నిధులు మింగేసిన ఉద్యోగులు

చింతపల్లి/కొయ్యూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బలపం పంచాయతీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యాన పంటల సాగులో జరిగిన అక్రమాలపై ఆరుగురు ఉద్యోగులపై వేటు పడింది. ప్రస్తుతం చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పనిచేస్తున్న ఆరుగురు ఉపాధి ఉద్యోగులను డ్వామా పీడీ డాక్టర్‌ డీవీ విద్యాసాగర్‌(టీవోసీ) సస్పెండ్‌ చేశారు. మరో ఉద్యోగికి షోకాజు నోటీసు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..

2022-23 వార్షిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బలపం పంచాయతీ పరిధిలో 220 మంది ఆదివాసీ రైతులకు ఉద్యాన పంటల మొక్కలు పంపిణీ చేశారు. 2023-24 వార్షిక సంవత్సరంలో 26 మందికి డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు అందజేశారు. ఈ ఉద్యాన పంట మొక్కల సాగుకు ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించాల్సిన రూ.20లక్షల సాగు ప్రోత్సాహక నిధులు ఉపాధి ఉద్యోగులు కుమ్మక్కై దోచుకున్నారు. పంచాయతీ పరిధి చెరువూరు, గుంజువీధి గ్రామాలకు చెందిన గిరిజన రైతులు సాగు ప్రోత్సాహక నిధులు మూడేళ్లు గడిచినా అందలేదని మీకోసంలో జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ నేపఽథ్యంలో ఈనెల 5వ తేదీన డ్వామా పీడీ డాక్టర్‌ డీవీ విద్యాసాగర్‌, ఏపీడీ లాలం సీతయ్య బలపం పంచాయతీలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహక నిధులు దోచుకున్నట్టు రుజువైంది. ఈమేరకు బలపం ఫీల్ట్‌ అసిస్టెంట్‌ కొంట కోటి, టీఏ అన్నపూర్ణతోపాటూ గతంలో చింతపల్లిలో పనిచేసి ప్రస్తుతం కొయ్యూరులో పనిచేస్తున్న టీఏ ఎ. ప్రభాకరరావు, కంప్యూటర్‌ ఆపరేటర్‌, అకౌంటెంట్‌ అసిస్టెంట్‌ డి. రమణకుమారి, జి.మాడుగులలో పనిచేస్తున్న ఈసీ మధుసూదన్‌, ప్లాంట్‌ సూపర్‌వైజర్‌ పుష్కరరావులను సస్పెండ్‌ చేశారు. బలపం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ టిబ్రూకు షోకాజు నోటీసు జారీచేశారు. అలాగే ఫీల్ట్‌ అసిస్టెంట్‌ కొంట కోటి నుంచి రూ.12,95,614, టీఏ అన్నపూర్ణ రూ.2.2లక్షలు, చింతపల్లిలో పనిచేసి, ఉద్యోగం నుంచి తొలగించిబడిన ఏపీవో మూర్తి రూ.2.2లక్షలు, టీఏ ప్రభాకరరావు రూ.1.1లక్షలు, ఈసీ మధుసూదన్‌ రూ.50వేలు, ప్లాంట్‌ సూపర్‌వైజర్‌ పుష్కరరావు నుంచి రూ.30 వేలు రికవరీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 10:51 PM