Share News

ఉద్యోగులు ఉక్కురిబిక్కిరి

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:20 AM

ఏ బరువు వేసినా మోయాల్సిందే...అన్నట్టుగా స్టీల్‌ప్లాంటు యాజమాన్యం వ్యవహరిస్తోంది.

ఉద్యోగులు ఉక్కురిబిక్కిరి

  • ఏ పని చెప్పినా చేయాల్సిందేనంటున్న స్టీల్‌ప్లాంటు యాజమాన్యం

  • సెక్షన్‌ ఇన్‌చార్జి ఆదేశాలు పాటించాలని హుకుం

  • ట్యాపింగ్‌, చార్జింగ్‌, కన్వర్టర్‌ ఆపరేషన్‌ బాధ్యతలు

  • పని ఒత్తిడితో సతమతం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఏ బరువు వేసినా మోయాల్సిందే...అన్నట్టుగా స్టీల్‌ప్లాంటు యాజమాన్యం వ్యవహరిస్తోంది. స్టీల్‌ప్లాంటు వంటి సాంకేతిక కర్మాగారాల్లో అనేక రకాల నిపుణులు వేర్వేరు పనులు చేస్తుంటారు. కానీ తాజాగా ఎవరు ఏ పనైనా చేయాలని యాజమాన్యం నిర్దేశించింది. అత్యధిక ఉత్పత్తి సాధించడమే లక్ష్యమని, దానికి తగ్గట్టు పనిచేయాలని ఒత్తిడి పెడుతోంది. సెక్షన్‌ ఇన్‌చార్జి ఏ బాధ్యత అప్పగించినా చేయాల్సిందేనంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని తొలుత స్టీల్‌మెల్టింగ్‌ షాప్‌-2లో అమలుచేయాలని ఆదేశించింది.

రోజుకు 19 వేల టన్నులకుపైగా ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున.. దానికి తగ్గట్టుగా పనితీరు మెరుగుపడాలని, అందుకే ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు ఉక్కు యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొంది. కన్వర్టర్‌ ఆపరేషన్లు, క్రేన్‌ ఆపరేషన్లు చేపట్టే సమయంలో ఉద్యోగులు అన్నిరకాల పనులుచేయాలని సూచించింది. విభాగంలో సీనియర్‌ మోస్ట్‌ ఉద్యోగులు ట్యాపింగ్‌, చార్జింగ్‌, కన్వర్టర్‌ ఆపరేషన్‌ చేయాలనే నిబంధన పెట్టారు. ఒక షిఫ్ట్‌లో ఉండే చార్జ్‌మెన్లు, మాస్టర్‌, సీనియర్‌ టెక్నీషియన్లు టీమ్‌గా ఏర్పడి షిఫ్ట్‌ ఇన్‌చార్జి చెప్పినట్టు వినాలని ఉక్కు అధికారులు పేర్కొన్నారు. మానవ వనరులు తక్కువగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పత్తి తగ్గకూడదని ఉత్తర్వులో స్పష్టంచేశారు.

అనుభవం లేని చోట పనులు

ఎస్‌ఎంఎస్‌లో ట్యాపింగ్‌, చార్జింగ్‌, కన్వర్టర్‌ ఆపరేషన్‌ వేర్వేరు పనులు. వేల డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జరుగుతాయి. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తాయి. బ్లాస్ట్‌ ఫర్నేసుల్లో కుతకుత మరుగుతున్న లిక్విడ్‌ స్టీల్‌ని ల్యాడిల్‌ ద్వారా బయటకు తీయడాన్ని ట్యాపింగ్‌గా వ్యవహరిస్తారు. ఇక్కడ సమయం అత్యంత కీలకం. ఈ ప్రక్రియ అంతా 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో పూర్తిచేస్తారు. లిక్విడ్‌ స్టీల్‌ (ఇనుము)ను పూర్తిస్థాయి స్టీల్‌ (ఉక్కు)గా మార్చడానికి కొన్నిరకాల మెటీరియల్స్‌ జత చేస్తారు. వాటిని ఎడిషన్లు అంటారు. ఈ ప్రక్రియను చార్జింగ్‌గా వ్యవహరిస్తారు. ఖాళీ ల్యాడిల్స్‌లోకి ఆక్సిజన్‌ బ్లో చేసి మరో ప్రక్రియకు సిద్ధం చేయడాన్ని కన్వర్టింగ్‌ ఆపరేషన్‌గా పిలుస్తారు.

నిపుణుల కొరతే కారణం

ఇప్పటివరకు నైపుణ్యం ఉన్న సీనియర్లే ఈ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఏ పని అయినా చేయాలని నిర్దేశించారు. ఏమైనా పొరపాట్లు జరిగితే అది ప్రాణాలతో చెలగాటమే. అవగాహన రాహిత్యంతోనే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వీఆర్‌ఎస్‌ పేరుతో సుమారుగా 1,800 మందిని ఇంటికి పంపించేసి, వారు చేసిన పనులన్నీ ఇతరులు పంచుకోవాలని ఆదేశిస్తూ పనిభారం మోపుతున్నారని, పనిగంటలు పెంచేశారని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Oct 10 , 2025 | 01:20 AM