చిటికెలో విద్యుత్ కనెక్షన్
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:18 AM
విద్యుత్ కనెక్షన్ల జారీకి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కొత్త విధానం అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకూ కొత్త కనెక్షన్ కావాలంటే దరఖాస్తు సమర్పించిన తరువాత స్థల పరిశీలన చేసి, ఎంత వ్యయం అవుతుందో అంచనా వేసేవారు.
దరఖాస్తుతో పాటు స్థిర చార్జీలు చెల్లిస్తే వెంటనే ఆదేశాలు
ఈపీడీసీఎల్ కొత్త విధానం
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీకారం
విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):
విద్యుత్ కనెక్షన్ల జారీకి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కొత్త విధానం అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకూ కొత్త కనెక్షన్ కావాలంటే దరఖాస్తు సమర్పించిన తరువాత స్థల పరిశీలన చేసి, ఎంత వ్యయం అవుతుందో అంచనా వేసేవారు. దానిపై సర్వీస్ లైన్ చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీలు వసూలు చేసేవారు. తనిఖీకి వచ్చిన అధికారి విచక్షణపై ఈ మొత్తం ఆధారపడి ఉండేది. ఈ ప్రక్రియకుకొంత సమయం పట్టేది.
ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ వినియోగదారుల చట్టం 2020కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొన్ని సవరణలు చేయడంతో ఏపీఈపీడీసీఎల్ కొత్త విధానం తీసుకువచ్చింది. 150 కిలోవాట్ల వరకు కనెక్షన్లకు ఫిక్స్‌డ్ చార్జీలు నిర్ణయించారు. ఈ మొత్తాన్ని దరఖాస్తుతో పాటు చెల్లిస్తే వెంటనే కనెక్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయిపోతాయి. దీనివల్ల చాలా తక్కువ సమయంలో విద్యుత్ సదుపాయం లభిస్తుంది. సైట్ ఇన్‌స్పెక్షన్, ఎస్టిమేషన్ వంటివి ఇందులో ఉండవు.
ఎవరికి వర్తిస్తుందంటే..?
ఇప్పటికే విద్యుత్ సదుపాయం ఉన్న ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్నవారు కొత్త కనెక్షన్ తీసుకుంటే చార్జీలు ఇలా ఉంటాయి.
- గృహ వినియోగదారులకు మొదటి కిలోవాట్‌కు రూ.1,500.
- వాణిజ్య వినియోగదారులకు మొదటి కిలోవాట్‌కు రూ.1,800
...ఆపై ప్రతి అదనపు కిలోవాట్‌కు రూ.2 వేలు చొప్పున తీసుకుంటారు. ఇలా 20 కిలోవాట్ల వరకూ లెక్కించి తీసుకుంటారు.
ఇవికాకుండా కనెక్షన్ లోడ్ చార్జీల (డొమెస్టిక్) కింద సర్వీస్ లైన్, డెవలప్‌మెంట్ చార్జీలు కలిపి 500 వాట్ల వరకు రూ.800, ఆపై 501 నుంచి 1000 వాట్ల వరకు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది..
నాన్ డొమెస్టిక్/కమర్షియల్ కనెక్షన్లకు...
మొదటి 250 వాట్ల వరకు రూ.600, 251 వాట్ల నుంచి 500 వాట్ల వరకు రూ.1,000 కట్టాలి. ఇలా ఎల్‌టీ-3, ఎల్‌టీ-4, హెచ్‌టీ కనెక్షన్ కోరుకునే వారికి చార్జీలు నిర్ణయించారు.
ముందుగా చెల్లించడంతో తక్షణ సేవలు
పృథ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్
స్థిరమైన చార్జీలు ముందుగానే నిర్ణయించడం వల్ల ఎస్టిమేషన్ పేరుతో జాప్యం ఉండదు. విచక్షణా అధికారంతో అంచనాలు పెంచే అవకాశమూ లేదు. ఎవరికి ఎంత విద్యుత్ లోడ్ పడుతుందో లెక్కించుకొని ఆ మేరకు చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. దీని వల్ల తక్షణమే సేవలు అందించగలుగుతాము. ఇదంతా పూర్తి పారదర్శకంగా ఉంటుంది.