అనకాపల్లిలో విద్యుత్ సర్కిల్!
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:31 AM
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో కొత్తగా అనకాపల్లి జిల్లా సర్కిల్ కార్యాలయం ఏర్పాటు, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ మొదలైంది. కొత్త సర్కిల్ కార్యాలయాన్ని అనకాపల్లిలోని ఒక ప్రైవేటు భవనంలో ఇటీవల ప్రారంభించారు. ఇక్కడ ఎస్‌ఈ, ఇద్దరు ఈఈలతోపాటు పలువురు ఇంజనీర్లు, అకౌంట్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఆపరేటర్లు వుంటారు.
మూడుచోట్ల డీఈ కార్యాలయాలు
విశాఖ నుంచి అధికారులు, ఉద్యోగుల సర్దుబాటు
తాత్కాలికంగా ప్రైవేటు భవనంలో ప్రారంభం
త్వరలో డీఈ కార్యాలయం ఆవరణలో సొంత భవన నిర్మాణం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో కొత్తగా అనకాపల్లి జిల్లా సర్కిల్ కార్యాలయం ఏర్పాటు, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ మొదలైంది. కొత్త సర్కిల్ కార్యాలయాన్ని అనకాపల్లిలోని ఒక ప్రైవేటు భవనంలో ఇటీవల ప్రారంభించారు. ఇక్కడ ఎస్‌ఈ, ఇద్దరు ఈఈలతోపాటు పలువురు ఇంజనీర్లు, అకౌంట్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఆపరేటర్లు వుంటారు.
గత వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల క్రితం జిల్లాలను పునర్విభజన చేసినప్పటికీ ఈపీడీసీఎల్‌కు జిల్లా సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. ఇన్‌చార్జిలను నియమించి చేతులు దులుపుకుంది. అప్పటి నుంచి విద్యుత్ పంపిణీ, బిల్లుల జారీ వంటి అన్ని కార్యకలాపాలు విశాఖపట్నం సర్కిల్ కార్యాలయం నుంచే సాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా విద్యుత్ వినియోగదారులకు ఈపీడీసీఎల్ సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదనే విమర్శలు, ఫిర్యాదులు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు ఎమ్మెల్యేలు.. అనకాపల్లి జిల్లాలో ఈపీడీసీఎల్ సర్కిల్, డివిజన్ కార్యాలయాల ఏర్పాటు ఆవశ్యకతను శాసనసభలో ప్రస్తావించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖ అధికారుల నుంచి వివరాలను రప్పించుకుంది. ప్రతి జిల్లాలో ఒక సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి, ఉద్యోగులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అనకాపల్లిలో ఒక సర్కిల్ కార్యాలయంతోపాటు అనకాపల్లి, నర్సీపట్నం, కశింకోటల్లో డివిజన్ కార్యాలయాలు, అన్ని మండలాల్లో ఏఈ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖపట్నం సర్కిల్ కార్యాలయం నుంచి పలువురు అధికారులు, సిబ్బందిని సర్కిల్, డివిజన్‌లకు సర్దుబాటు చేస్తున్నారు. కొత్త సర్కిల్ కార్యాలయాన్ని అనకాపల్లిలోని ఒక ప్రైవేటు భవనంలో ఇటీవల ప్రారంభించారు. అధికారులకు, ఉద్యోగులకు వేర్వేరుగా చాంబర్లను ఏర్పాటు చేశారు. అనకాపల్లి సర్కిల్ కార్యాలయానికి ఒక ఎస్‌ఈ, ఇద్దరు ఈఈలు, 44 మంది జూనియర్ ఇంజనీర్లు, 23 మంది సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, 56 మంది జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, 82 మంది జూనియర్ అసిస్టెంట్/డేటా ఆపరేటర్లను నియమించారు.
మరింత మెరుగ్గా విద్యుత్ సేవలు
జి.ప్రసాద్, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్, అనకాపల్లి సర్కిల్
అనకాపల్లి జిల్లాకు ఈపీడీసీఎల్ కొత్త సర్కిల్‌తోపాటు, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటు వల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. సర్కిల్ కార్యాలయాన్ని ప్రస్తుతం అద్దె భవనంలో ఏర్పాటు చేశాం. త్వరలో అనకాపల్లిలోని డివిజన్ కార్యాలయం ఆవరణలో సొంత భవనాన్ని నిర్మించేందుకు అనుమతులు వచ్చాయి. సర్కిల్ కార్యాలయానికి బదిలీపై వచ్చిన ఉద్యోగులను మూడు డివిజన్‌లకు సర్దుబాటు చేస్తాం.