విద్యుత్ వైర్ల దొంగల అరెస్టు
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:30 PM
వివిధ ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను పాయకరావుపేట పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 850 కిలోల వైర్లు, రూ.84,000 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
50 కిలోల వైర్లు, రూ.84,000 నగదు, కారు స్వాధీనం
నిందితుల్లో ఐదుగురు అల్లూరి జిల్లా వాసులు
పాయకరావుపేట, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : వివిధ ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న అంతర్ జిల్లాల దొంగల ముఠాను పాయకరావుపేట పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 850 కిలోల వైర్లు, రూ.84,000 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
పాయకరావుపేట మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన మంగి సుధాకర్‌రెడ్డి కొంతకాలంగా విజయనగరం జిల్లా కొత్తవలసలో స్ర్కాప్ వ్యాపారం చేస్తున్నాడు. అంతకు ముందు ఇతను వైర్లను దొంగిలించి అమ్ముకునేవాడు. కాగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఐదుగురు యువకులతో ఒక ముఠాను ఏర్పాటుచేసి పలుచోట్ల విద్యుత్ వైర్లను చోరీ చేయించి స్ర్కాప్‌గా అమ్ముతున్నాడు. చోరీల కోసం కొన్నిసార్లు కారును కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల పాయకరావుపేట చుట్టుపక్కల ఇళ్ల స్థలాల లేఅవుట్లలోని విద్యుత్ స్తంభాల నుంచి వైర్లను చోరీ చేశారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా కారు కదలికలను గుర్తించి ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు 850 కిలోల విద్యుత్ వైర్లు, రూ.84,000 నగదు, చోరికి ఉపయోగించే వస్తువులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మంగి సుధాకర్‌రెడ్డి, అరకులోయ మండలం, రంగినిగుడకు చెందిన కొర్ర రాజు, గొబ్బి కార్తిక్, జన్ని కిరణత్‌పాటు మరో ఇద్దరు బాల నేరస్థులు వున్నారు. సుధాకర్‌రెడ్డిపై గతంలో 25 కేసులు నమోదయ్యాయి. ఇతనిపై పీడీ యాక్టు చేస్తామని, నిందితుల్లో నలుగురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించామని, మిగిలిన ఇద్దరు బాల నేరస్థులను జువైనల్ హోమ్‌కి తరలిస్తామని తెలిపారు. సీఐ జి.అప్పన్న, ఎస్‌ఐ పురుషోత్తమ్, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారని, వీరికి త్వరలో రివార్డులు అందజేస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.