సిటీ రోడ్లపై ఎలక్ర్టిక్ బస్సులు
ABN , Publish Date - May 09 , 2025 | 01:24 AM
నగరంలోని ప్రధాన రహదారులపై ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు.
నగరానికి 200 బస్సులు కేటాయింపు
తొలివిడత 50 బస్సులు త్వరలో రాక
ప్రధాన రహదారుల్లో నడిపేందుకు అధికారుల నిర్ణయం
గాజువాక, సింహాచలం ప్రాంతాల్లో ప్రత్యేక గ్యారేజీలు, చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు
ద్వారకా బస్‌స్టేషన్, మే 8 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ప్రధాన రహదారులపై ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. విశాఖ రీజియన్‌కు నాలుగు విడతల్లో 200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అందులో మొదటి విడత 50 బస్సులు త్వరలో పంపనున్నట్టు ఆర్టీసీ విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందింది.
మొదటి విడత వచ్చిన ఈ-బస్సులను సింహాచలం, గాజువాక, మధురవాడ డిపోలను కేంద్రాలుగా చేసుకొని నడపాలని నిర్ణయించారు. గాజువాక డిపో వెనుక ఐదు ఎకరాల్లో, సింహాచలం డిపో వెనుక గల సింహపురి లేఅవుట్‌లో నాలుగు ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సు డిపోలు ఏర్పాటుచేయనున్నారు. ఈ రెండు డిపోల నుంచి మొదటి విడత ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ఈ రెండు స్థలాలను పరిశీలించారు. ఈ-గ్యారేజీ నిర్వహణ, చార్జింగ్‌కు ఏ మేరకు విద్యుత్ వినియోగమవుతుంది, ఎంత కెపాసిటీ కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నది అంచనా వేశారు. గాజువాక డిపో మేనేజర్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అధికారులు, గ్యారేజీ అధికారులతో సమావేశమై వారి అంచనాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే సింహపురి ఎలక్ట్రికల్ బస్ డిపోనకు సంబంధించి డిపో మేనేజర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులు, గ్యారేజీ అధికారులతో కొద్దిరోజుల క్రితం సమావేశమయ్యారు. త్వరలో ఈ రెండు ప్రాంతాలకు విద్యుత్, ట్రాన్స్‌ఫార్మర్లు, చార్జింగ్ ఎక్విప్‌మెంట్ వంటి సమకూరుస్తామని ఆర్టీసీ అధికారులకు తెలిపారు. రెండో విడతలో మధురవాడ డిపోను ఈ-బస్సుల డిపోగా మారుస్తామని ప్రకటించారు.
మొదటి విడతగా విశాఖ రీజియన్‌కు వచ్చిన ఈ-బస్సులను గాజువాక, సింహాచలం డిపోలు కేంద్రాలుగా నగరంలోని ప్రధాన రహదారుల్లో నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు తయారుచేశారు. సింహాచలం నుంచి ద్వారకా కాంప్లెక్సు, పాత పోస్టాఫీస్, ఆర్‌కే బీచ్, సింథియా ప్రాంతాలకు, గాజువాక నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్కే బీచ్, సింహాచలం, పెందుర్తి ప్రాంతాలకు నడిపేందుకు నిర్ణయించారు. రెండో దశలో రానున్న ఈ-బస్సులను ఇతర రూట్లలో నడిపేందుకు నిర్ణయించారు.
నిర్వాహణ వ్యయం, కాలుష్యం తగ్గించేందుకు
బి.అప్పలనాయుడు, రీజనల్ మేనేజర్, విశాఖ రీజియన్
నిర్వహణ వ్యయం, నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ-బస్సులు వినియోగం అవసరం. ఫ్యూయల్‌తో నడిచే బస్సుల నిర్వాహణ వ్యయం కంటే ఈ-బస్సుల నిర్వహణ వ్యయం చాలా తక్కువ. నగరంలో వాహన కాలుష్యం అధికంగా ఉన్న కారణంగా ఎలక్ట్రిక్ బస్సుల అవసరాన్ని ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి నివేదించాం. స్మార్ట్ సిటీ స్థాయికి తగ్గట్టు బస్సులు ఉండాలన్న ఉద్దేశంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదన చేశాం. ఆ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వం స్పందించింది. త్వరలో నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి.