Share News

ప్రేమసమాజం భూములపై పెద్దల కన్ను

ABN , Publish Date - Nov 02 , 2025 | 01:00 AM

డాబాగార్డెన్స్‌లోని సేవా సంస్థ ప్రేమసమాజం భూములపై కొందరు పెద్దల కన్నుపడింది.

ప్రేమసమాజం భూములపై పెద్దల కన్ను

దీర్ఘకాలిక లీజుకు తీసుకోవాలని యత్నం

దేవదాయ శాఖ భూములకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నం

అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారా?, లేదా?....

సర్వత్రా అనుమానాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

డాబాగార్డెన్స్‌లోని సేవా సంస్థ ప్రేమసమాజం భూములపై కొందరు పెద్దల కన్నుపడింది. వాటిని దీర్ఘకాలిక లీజుకు తీసుకునేందుకు యత్నిస్తున్నారు. దీనికి సంస్థ కార్యవర్గంలో కొందరు సహకరిస్తున్నారు. దీంతో తాజాగా ప్రభుత్వం దేవదాయ శాఖకు చెందిన భూములను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు అనుమతిస్తూ జారీచేసిన ఉత్తర్వులను అందుకు అనుకూలంగా మలచుకుంటున్నారు.

ప్రేమ సమాజానికి కొన్ని దశాబ్దాల క్రితం దాతలు రుషికొండ సర్వే నంబర్లు 16, 23, 24లలో 47.33 ఎకరాలు దానంగా ఇచ్చారు. వాటిలో కొన్ని బీచ్‌ను ఆనుకొని ఉన్నాయి. అందులో 33.4 ఎకరాలను ఓ రిసార్ట్స్‌ యాజమాన్యం చాలాకాలం కిందట లీజుకు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూములపై కన్నేసింది. వాటిని చేజిక్కించుకోవడానికి ప్రేమ సమాజాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఆదేశాలు ఇచ్చింది. లీజుదారుడు టీడీపీ సానుభూతిపరుడని పేర్కొంటూ ఆయన దగ్గరున్న భూమిలో 28 ఎకరాలు వెనక్కి తీసుకుంది. ఆ భూములతో కలిపి ఇప్పుడు సుమారు 40 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. అప్పట్లో విశాఖ డెయిరీ పెద్దలు గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తామంటూ వాటిని లీజుకు తీసుకోవాలని యత్నించారు. ఇందుకోసం ప్రేమ సమాజం పెద్దలతో సంప్రతింపులు జరిపారు. నాటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండగా ఉండడంతో అప్పట్లో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన కాళింగిరి శాంతి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. అయితే అంతా రచ్చ రచ్చ కావడంతో వైసీపీ నాయకులు వెనక్కి తగ్గారు.

ఖాళీగా ఉంచకూడదని వారి ఆలోచన

రుషికొండలో ఇప్పుడు ఎకరా భూమి రూ.40 కోట్లు పలుకుతోంది. ఆ లెక్కన ప్రేమ సమాజం భూమి విలువ సుమారు రూ.1,500 కోట్లు దాటి ఉంటుంది. అంత విలువైన భూమిని కాపాడడం కష్టమని, ఎవరికైనా లీజుకు ఇస్తే ఆదాయం వస్తుందని ప్రస్తుత కార్యవర్గం వాదిస్తోంది. రోడ్డు పక్కన కంటెయినర్లు పెట్టి అద్దెకు ఇస్తే ఆదాయం వస్తుందని కొందరు ప్రతిపాదించారు. అరకులోయ ప్రాంతం నుంచి గిరిజనులను తీసుకువచ్చి, వారికి అక్కడే నివాసం ఏర్పాటుచేసి, వారితో ఆర్గానిక్‌ వ్యవసాయం చేయించాలని మరికొందరు ప్రతిపాదించారు. వారు అక్కడే ఉంటారు కాబట్టి భూములకు రక్షణ ఉంటుందని ఆలోచించారు. ఇంకొందరు కల్యాణ మండపం నిర్మించాలని, గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తే, బాక్స్‌ క్రికెట్‌ వంటివి ఏర్పాటుచేస్తే బాగుంటుందని సూచించారు. కార్యవర్గం ఒక అభిప్రాయానికి రాకపోవడం, ఇది బయటకు పొక్కడంతో కొందరు కూటమి నేతలు రంగంలో దిగారు. ఆ భూములను తమ వారికి దీర్ఘకాలిక లీజుకు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు పది ఎకరాలు లీజుకు ఇవ్వాలని, క్రికెట్‌ ప్లేయర్లకు అక్కడ శిక్షణ ఇస్తామని కొందరు ప్రతిపాదించారు. ఇంకొందరు మంచి కన్వెన్షన్‌ సెంటర్‌తో పాటు రెస్టారెంట్‌ ఏర్పాటుచేస్తామని, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ జోన్‌ పెడతామని 5 నుంచి 10 ఎకరాలు లీజుకు ఇవ్వాలని కోరారు. దీర్ఘకాలిక లీజుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాము ఆదేశాలు వచ్చేలా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.

వేలం వేసే ఇవ్వాలి

ఇదిలావుండగా ఖాళీగా ఉన్న దేవదాయ శాఖ భూములను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని, ఇందుకోసం నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులతో రుషికొండలో ప్రేమ సమాజం భూములను దక్కించుకునే ప్రక్రియ వేగవంతం అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భూములను ఎవరికైనా లీజుకు ఇవ్వాలని అనుకుంటే పత్రికల్లో ప్రకటన ఇచ్చి బహిరంగ వేలం ద్వారానే కేటాయించాలి. అలా నిబంధనలను పాటిస్తారా? లేక ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా దక్కించుకుంటారా? అనేది చూడాలి

Updated Date - Nov 02 , 2025 | 01:00 AM