మేడపై నుంచి పడి వృద్ధుడి మృతి
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:38 AM
మేడపై నుంచి కాలు జారి పడి తీవ్రంగా గాయపడిన వృద్ధుడు వైద్యసేవలు పొందుతూ మృతిచెందినట్టు కృష్ణాదేవిపేట ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా వున్నాయి. గొలుగొండ మండలం ఏఎల్‌పురం గ్రామానికి చెందిన లగుడు అప్పలనాయుడు(66) బుధవారం తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం లేచి మేడపై నుంచి కిందకు దిగే క్రమంలో కాలుజారి సీసీరోడ్డుపై పడ్డాడు.
కృష్ణాదేవిపేట, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): మేడపై నుంచి కాలు జారి పడి తీవ్రంగా గాయపడిన వృద్ధుడు వైద్యసేవలు పొందుతూ మృతిచెందినట్టు కృష్ణాదేవిపేట ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా వున్నాయి. గొలుగొండ మండలం ఏఎల్‌పురం గ్రామానికి చెందిన లగుడు అప్పలనాయుడు(66) బుధవారం తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం లేచి మేడపై నుంచి కిందకు దిగే క్రమంలో కాలుజారి సీసీరోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయమైంది. ఆ ఇంటి మేడపై పిట్టగోడ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే 108లో నర్సీపట్నం తీసుకువెళ్లగా.. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యసేవల నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో వైద్యసేవలు పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. అప్పలనాయుడు భార్య సత్యవతి ఫిర్యాదుతో ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ఎలమంచిలి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక రామ్‌నగర్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామ్‌నగర్ టిడ్కో కాలనీకి చెందిన కుండల లోకనాఽథం (57) గురువారం హైవే పక్కన ఉన్న ఒక పెట్రోల్ బంకులో తన ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కొట్టించుకుని తిరిగి ఇంటికి వస్తున్నాడు. అనకాపల్లి వైపు నుంచి తుని వైపు వెళుతున్న మరో ద్విచక్ర వాహనదారుడు బలంగా ఢీకొన్నాడు. దీంతో లోకనాథం తలకు తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
భర్త, అత్తపై వేధింపుల కేసు
అనకాపల్లి టౌన్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): వివాహితను వేధిస్తున్నట్టు అందిన ఫిర్యాదుపై భర్త, అత్తలపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. అనకాపల్లి మండలం తుమ్మపాలకు చెందిన చేకూరి రఘునాథవర్మ, దుర్గాభవానీలకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజుల తరువాత నుంచే అదనపు కట్నం తీసుకురావాలని దుర్గా భవానీని భర్తతోపాటు అత్త లక్ష్మి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ బాధలు తట్టుకోలేక లక్ష్మీదేవిపేటలోని అమ్మమ్మ ఇంటికి (తల్లిదండ్రులు లేరు) వెళ్లిపోయి అక్కడే వుంటున్నది. భర్త ఇంటిలో వున్న తన వస్తువులు తెచ్చుకోనివ్వడం లేదంటూ దుర్గాభవాని కోర్టులో కేసు వేసింది. ఈమెకు సంబంధించిన వస్తువులను తీసుకోవడానికి మెట్టినింటి వారు అనుమతి ఇవ్వాలంటూ గత నెల 15వ తేదీన కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 17వ తేదీన అక్కడకు వెళ్లగా.. భర్త, అత్త సామాన్లు ఇవ్వకపోవడమే కాకుండా దూషించి, చంపుతామని బెదిరించారు. ఈ విషయంపై కుల పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా మెట్టింటి వారు స్పందించలేదు. దీంతో దుర్గాభవానీ గురువారం రాత్రి రఘునాథవర్మ, లక్ష్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సంతోశ్‌కుమార్ తెలిపారు.