భాగస్వామ్య సదస్సుకు చకచకా ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:06 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మొత్తం ఎనిమిది హాళ్లలో ప్రధాన వేదిక, ముఖాముఖి సమావేశాలకు వీలుగా ఛాంబర్లు, డైనింగ్‌హాలు, ప్రముఖులకు క్యాబిన్లు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక బుధవారం రాత్రికి రెడీ అవుతుంది. ఇంకా స్టాళ్ల ఏర్పాటుకు వీలుగా క్యాబిన్లు నిర్మించారు. ఢిల్లీలో బాంబుపేలుళ్ల నేపథ్యంలో సదస్సు ప్రాంగణంలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. బుధవారం నుంచి ప్రాంగణం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లనున్నది. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి నగరానికి రానున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం సీఎంకు పోర్టు అతిథి గృహంలో బస ఏర్పాటుచేస్తున్నారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బస చేస్తారు.
నేటి రాత్రికి ప్రధాన వేదిక సిద్ధం
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కట్టుదిట్టంగా భద్రత
నేటి రాత్రి నగరానికి సీఎం రాక
విశాఖపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మొత్తం ఎనిమిది హాళ్లలో ప్రధాన వేదిక, ముఖాముఖి సమావేశాలకు వీలుగా ఛాంబర్లు, డైనింగ్‌హాలు, ప్రముఖులకు క్యాబిన్లు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక బుధవారం రాత్రికి రెడీ అవుతుంది. ఇంకా స్టాళ్ల ఏర్పాటుకు వీలుగా క్యాబిన్లు నిర్మించారు. ఢిల్లీలో బాంబుపేలుళ్ల నేపథ్యంలో సదస్సు ప్రాంగణంలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. బుధవారం నుంచి ప్రాంగణం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లనున్నది. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి నగరానికి రానున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం సీఎంకు పోర్టు అతిథి గృహంలో బస ఏర్పాటుచేస్తున్నారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బస చేస్తారు.
సీ వ్యూ హోటళ్లకు అతిథులు మొగ్గు
భాగస్వామ్య సదస్సుకు హాజరుకానున్న విదేశీ అతిథులతోపాటు దేశీయ ప్రతినిధులు ఎక్కువగా సముద్రానికి ఆనుకుని ఉన్న హోటళ్లలోనే బస ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రధానంగా రెండు ప్రముఖ హోటళ్లలోనే గదులు కేటాయించాలని పట్టుబడుతున్నారు. అతిథులకు లైజనింగ్ చేసే ప్రభుత్వ అధికారులు, సీఐఐ ప్రతినిధులకు ఫోన్లు చేసి సీవ్యూ ఉన్న హోటళ్లలో గదులు కావాలని అడుగుతున్నారు. ఈ సదస్సుకు వచ్చే అతిథుల కోసం అధికారులు నగరంలోని పలు హోటళ్లలో సుమారు 1,300 గదులు రిజర్వు చేశారు. వారి హోదాను బట్టి గదులు కేటాయించాలని నిర్ణయించారు. అయితే సదస్సుకు వచ్చే ప్రముఖుల ఎంతమంది అనే లెక్కలు మారుతున్నాయి. దాంతో వారికి వసతి, రవాణా సదుపాయాల కల్పనలో అంచనాకు రాలేకపోతున్నారు. రోజురోజుకూ అతిథుల సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.