Share News

స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:13 PM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

ప్రభుత్వ పథకాలపై స్టాళ్లు, శకటాలు ఏర్పాటు చేయాలని సూచన

పాడేరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది తరహాలోనే స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల మైదానంలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను వేడుకలకు ఆహ్వానించి, సత్కరించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమస్వయంతో పని చేసి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులకు కలెక్టర్‌ సూచించారు. వేడుకలకు హాజరయ్యే అధికారులు, అతిథులు, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్టాళ్లు ఏర్పాటు, శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు, ఐసీడీఎస్‌, సెరీకల్చర్‌, అటవీశాఖ, జిల్లా ఆస్పత్రి, దివ్యాంగుల సంక్షేమ శాఖలు సంయుక్తంగా స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, అటవీశాఖ, పర్యాటక శాఖ, జీసీసీ, పౌర సరఫరాల శాఖ, డ్వామా, ఎస్‌ఎంఐ, గృహ నిర్మాణ శాఖ, విద్యుత్‌, ఆర్‌టీవో, అన్ని ఇంజనీరింగ్‌ విభాగాలు, వ్యవసాయానుబంధ శాఖలు సంయుక్తంగా ప్రభుత్వ అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, పోలీస్‌అధికారి ఎస్‌.ఎల్‌.నారాయణరెడ్డి, డీఈవో పి.బ్రహ్మజీరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, గ్రామ సచివాలయాల నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నంద్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వమిత్ర, డ్వామా పీడీ విద్యాసాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:13 PM