తుది దశకు ఈకేవైసీ ప్రక్రియ
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:51 AM
జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ తుది దశకు చేరింది. వాస్తవానికి ప్రభుత్వం జిల్లాలో 2,33,260 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా తేల్చింది. వీరంతా ఈకేవైసీ చేయాలని సూచించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల కొద్ది మంది మాత్రమే ఈకేవైసీ చేసుకోగలిగారు.
- గతంలో వివరాలు ఇచ్చిన రైతులకు మినహాయింపు
- త్వరలో వెబ్‌సైట్‌లో అన్నదాత సుఖీభవ పథకం తుది జాబితా
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ తుది దశకు చేరింది. వాస్తవానికి ప్రభుత్వం జిల్లాలో 2,33,260 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా తేల్చింది. వీరంతా ఈకేవైసీ చేయాలని సూచించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల కొద్ది మంది మాత్రమే ఈకేవైసీ చేసుకోగలిగారు. గడువులోగా ఈకేవైసీ చేయించుకోలేమోనని మిగతా రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో సేకరించిన ఆన్‌లైన్ డేటాతో రైతుల వివరాలు సరిపోవడంతో జిల్లాలో 2,28,762 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ఆయా రైతుల వివరాల స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వివరాల ఆధారంగా జిల్లాలో కేవలం 4,498 మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎంత మంది ఈకేవైసీ చేయించుకున్నారు?, ఇంకా ఎంత మంది చేయించుకోవాలనే వివరాలను జిల్లా అధికారులు మండల వ్యవసాయధికారులకు పంపి మిగిలిన వారి ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
ఆ రైతులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గతంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచిన రైతులు ఈకేవైసీ చేయించుకోవలసిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు తెలిపారు. జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతుల ఈకేవైసీ ప్రక్రియ జరుగుతోందన్నారు. గతంలో కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఈకేవైసీ చేయించుకున్న రైతుల వివరాల ఆధారంగా అన్నదాత సుఖీభవ పథకానికి మరోసారి ఈకేవైసీ చేసుకోకుండా మినహాయింపు ఇవ్వడం వల్ల జిల్లాలో 98 శాతానికిపైగా రైతులకు మినహాయింపు లభించిందన్నారు. క్షేత్రస్థాయిలో అభ్యంతరాలను పరిశీలించి కొన్ని రకాల మార్పులు చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు.