ముమ్మరంగా రేషన్‌కార్డుల ఈకేవైసీ
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:23 PM
జిల్లాలో ప్రస్తుతం రేషన్‌కార్డుల ఈకేవైసీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ప్రతి రేషన్‌కార్డులోని లబ్ధిదారుని బమోమెట్రిక్‌ను విధిగా ఈకేవైసీ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలో ఈ పక్రియను పౌర సరఫరాల అధికారులు సారఽథ్యంలో చేపడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 2,98,092 కార్డులు, 8,69,318 మంది లబ్ధిదారులు
ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తయింది 7,79,058 మందికి, పెండింగ్ 77,884 మంది
ప్రతి రేషన్ లబ్ధిదారుని బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి
ఐదేళ్లలోపు 11,901 మంది పిల్లలకు, 80 పైబడిన వృద్ధులకు మినహాయింపు
ఈ నెలాఖరు వరకే నమోదుకు గడువు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రస్తుతం రేషన్‌కార్డుల ఈకేవైసీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ప్రతి రేషన్‌కార్డులోని లబ్ధిదారుని బమోమెట్రిక్‌ను విధిగా ఈకేవైసీ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలో ఈ పక్రియను పౌర సరఫరాల అధికారులు సారఽథ్యంలో చేపడుతున్నారు.
జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 2 లక్షల 98 వేల 92 రేషన్‌కార్డులుండగా, వాటిలో 8 లక్షల 69 వేల 318 మంది లబ్ధిదారులున్నారు. దీంతో వారిందరినీ ఈకేవైసీ చేయించేందుకు చర్యలు చేపడుతుండగా, ఇప్పటికి(గురువారం నాటికి) 7 లక్షల 79 వేల 58 మందికి ఈకేవైసీ పూర్తిగా కాగా, ఇంకా 77 వేల 884 మందికి ఈకేవైసీ చేయించాల్సి ఉంది. అలాగే లబ్ధిదారులైన ఐదేళ్లలోపున్న 11,901 మంది పిల్లలు, 80 ఏళ్లు పైబడిన 475 మంది వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఈకేవైసీ కాని వాళ్లు మాత్రం నెల 30వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకోవడానికి ప్రభుత్వం గడువు ఇచ్చింది. దీంతో గడువు నాటికి ఎట్టి పరిస్థితుల్లో శత శాతం రేషన్‌కార్డులను ఈకేవైసీ చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి బి.గణేశ్‌కుమార్ తెలిపారు.
రేషన్‌కార్డుల ప్రక్షాళనతో బోగస్ ఏరివేతే లక్ష్యం
ఈకేవైసీ ప్రక్రియతో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల ప్రక్షాళనతో పాటు బోగస్ కార్డుల ఏరివేతకు అవకాశం ఉందటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనర్హులకు సైతం రేషన్‌కార్డులు మంజూరు చేయడంతో పాటు కార్డులోని లబ్ధిదారులు మృతి చెందినా వారి పేర్లను తొలగించని పరిస్థితి ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా కార్డుల్లో పేర్లు తొలగించకపోవడంతో వారి పేరిట నెల కోటా రేషన్ సరకులు పొందుతున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులందరి బయోమెట్రిక్ నమోదు చేయడంతో దాదాపుగా కార్డుల ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందే అవకాశాలుంటాయని అధికారులు అంటున్నారు.
ఈకేవైసీపీ చేయించకుంటే ముప్పే
ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న రేషన్‌కార్డుల ఈకేవైసీని లబ్ధిదారులు చేయించుకోకపోతే, వారి కార్డు రద్దయ్యే అవకాశాలున్నాయని అఽధికారులు అంటున్నారు. ఈకేవైసీ జరగని కారణంగా సదరు రేషన్‌కార్డు పని చేయకుండా పోవడంతో పాటు తరువాత రద్దు జాబితాలో చేరిపోతుంది. అందువల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలని సివిల్ సప్లై అధికారులు కోరుతున్నారు.
జిల్లాలో ఈకే వైసీ ప్రస్తుత పరిస్థితి
- జిల్లాలో 22 మండలాల్లో మొత్తం రేషన్ డిపోలు 671
- రేషన్‌కార్డుల సంఖ్య 2,98,092
- మొత్తం రేషన్ లబ్ధిదారులు 8,69,318 మంది
- ఇప్పటికి ఈకేవైసీ పూర్తయిన లబ్ధిదారులు 7,79,058 మంది
- పెండింగ్‌లో ఉన్న ఈకేవైసీ లబ్ధిదారులు 77,884 మంది
- 0 నుంచి 5 ఏళ్లలోపు ఉన్న లబ్ధిదారులు 11,091 మంది
- 80 ఏళ్లు పైబడిన వారు 475
- రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ గడువు ఈ నెల 30 వరకు