రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈకేవైసీ గడువు పెంపు
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:41 PM
రేషన్ కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవడానికి ప్రభుత్వం నెల రోజులు గడువు పెంచింది. లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోవాలని తొలుత ప్రకటించింది.
ఏప్రిల్ 30 వరకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం
ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఈకేవైసీ తప్పనిసరి
దూర ప్రాంతాల్లో ఉన్న వారిని రప్పించి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్‌డీటీలకు ఆదేశాలు
నర్సీపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవడానికి ప్రభుత్వం నెల రోజులు గడువు పెంచింది. లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోవాలని తొలుత ప్రకటించింది. రేషన్ లబ్ధిదారులందరూ ఈకేవైసీ చేయించుకోకపోవడంతో ఏప్రిల్ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ లోగా ప్రక్రియ పూర్తి చేయించాలని ఆర్డీవోలు, తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు, సీఎస్‌ఆర్‌ఐలుకు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో 14,99,160 మంది లబ్ధిదారులు ఉంటే 13,55,353 మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 1,43,807 మంది చేయించుకోవాల్సి ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కీలకం కాబట్టి ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు రేషన్ సరకులతో పాటు భవిష్యత్తులో మిగిలిన అన్ని పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు
నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌రాయవరం మండలాల సీఎస్‌డీటీ పరిధిలో 26,080 మంది ఈకేవైసీ చేయించుకోవాలి. నర్సీపట్నం, గొలుగొండ సీఎస్‌డీటీ పరిధిలో 12.126, నాతవరం, రోలుగుంట, కోటవురట్ల మండలాల పరిధిలో 13,121, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల పరిధిలో 10,624, ఎలమంచలి, రాంబిలి,్ల కశింకోట మండలాల పరిధిలో 16,110, మాడుగుల, మాకవరపాలెం, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల పరిధిలో 23,335, అచ్యుతాపురం, మునగపాక, పరవాడ మండలాల పరిధిలో 17,291, అనకాపల్లి, సబ్బవరం, చోడవరం సీఎస్‌డీటీ పరిధిలో 25,100 మంది ఈకేవైసీ చేయించుకోవలసి ఉంది. ఏప్రిల్ 30లోగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఊర్లో అందుబాటులో లేని వారికి సమాచారం అందజేసి ఈకేవైసీ చేయించాలని సీఎస్‌డీటీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఈకేవైసీ తప్పనిసరి
రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ఐదేళ్లు నిండిన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేయించుకోవల్సి ఉంది. ఐదేళ్లు దాటిన పిల్లల బయోమెట్రిక్ పడకపోతే ఆధార్ సెంటర్‌లో అప్‌డేట్ చేయించుకొని డీలర్ లాగిన్‌లో ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కేవీఎల్‌ఎన్ మూర్తి తెలిపారు.