Share News

హాకీ అకాడమీ మంజూరుకు కృషి

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:33 AM

నక్కపల్లి, కోటవురట్ల మండలాల్లో ఎక్కడైనా 8 ఎకరాల స్థలం ఉంటే వెంటనే హాకీ అకాడమీని మంజూరు చేయిస్తానని, ఇప్పటికే శాప్‌ చైర్మన్‌, క్రీడా మంత్రితో మాట్లాడానని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం మధ్యాహ్నం నక్కపల్లి బీఎస్‌ హాకీ క్లబ్‌ మైదానంలో రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌ -19 హాకీ పోటీలకు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు వుంటుందన్నారు.

హాకీ అకాడమీ మంజూరుకు కృషి
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తున్న హోం మంత్రి అనిత

- ఇప్పటికే శాప్‌ చైర్మన్‌, క్రీడా మంత్రితో మాట్లాడా..

- హోం మంత్రి అనిత

నక్కపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి, కోటవురట్ల మండలాల్లో ఎక్కడైనా 8 ఎకరాల స్థలం ఉంటే వెంటనే హాకీ అకాడమీని మంజూరు చేయిస్తానని, ఇప్పటికే శాప్‌ చైర్మన్‌, క్రీడా మంత్రితో మాట్లాడానని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం మధ్యాహ్నం నక్కపల్లి బీఎస్‌ హాకీ క్లబ్‌ మైదానంలో రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌ -19 హాకీ పోటీలకు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు వుంటుందన్నారు. బాల్యం నుంచి పిల్లలు మొబైల్‌ గేమ్స్‌కు అలవాటుపడకుండా తల్లిదండ్రులు చూడాలన్నారు. వారు మైదానంలో క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. నక్కపల్లికి హాకీని పరిచయం చేసి, ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిన హాకీ క్లబ్‌ వ్యవస్థాపకుడు బలిరెడ్డి సూరిబాబును హోం మంత్రి అనిత సత్కరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోడపాటి శివదత్‌, కూటమి నాయకులు తోట నగేశ్‌, ఏజెర్ల వినోద్‌రాజు, కొప్పిశెట్టి వెంకటేశ్‌, లాలం కాశీనాయుడు, కురందాసు నూకరాజు, చించలపు పద్దు, దేవర సత్యనారాయణ, అబద్దం, అల్లు నర్సింహమూర్తి, వెలగా శ్రీను, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం

మండల కేంద్రమైన నక్కపల్లిలో శనివారం ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి అండర్‌-19 హాకీ పోటీలు ప్రారంభమయ్యాయి. హోం మంత్రి వంగలపూడి అనిత, హాకీ పోటీల రాష్ట్ర పరిశీలకుడు రవిరాజు, ఉమ్మడి విశాఖ జిల్లాల ఎస్‌జీఎఫ్‌ అధికారులు హాజరై రాష్ట్రస్థాయి హాకీ పోటీలను ప్రారంభించారు. 13 జిల్లాల నుంచి సుమారు 800 హాకీ క్రీడాకారులు నక్కపల్లి వచ్చారు. హోం మంత్రి అనిత, అధికారులు త్రివర్ణపతాకాన్ని, క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోం మంత్రి అనితకు హాకీ క్రీడాకారులు ఘనంగా క్రీడా స్వాగతం పలికారు. ముందుగా హాకీ పితామహుడు ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి హోం మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. విశాఖ డీవీఈవో పి.ఉమారాణి, డీఐఈవో వినోద్‌రాజు, ఆర్‌ఐవో మురళి, డీఎస్‌డీవో పూజారి శైలజ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వీఏ పుష్పలత, హాకీ క్లబ్‌ ప్రతినిధులు సూరిబాబు, చిన్న అప్పారావు, రామచంద్రరావు, తాతాజీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

రసవత్తరంగా తొలిరోజు పోటీలు

తొలిరోజు నక్కపల్లి బీఎస్‌ హాకీ క్లబ్‌ మైదానంలో జరిగిన అండర్‌-19 ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు రసవత్తరంగా సాగాయి. బాలుర విభాగంలో ప్రకాశం జట్టుపై కడప, విజయనగరంపై గుంటూరు, కృష్ణా జిల్లా జట్టుపై నెల్లూరు, శ్రీకాకుళంపై తూర్పుగోదావరి, గుంటూరుపై అనంతపురం, పశ్చిమ గోదావరి జట్టుపై చిత్తూరు, కృష్ణా జిల్లా జట్టుపై విశాఖ జట్లు విజయం సాధించాయి.

బాలికల విభాగంలో విజయనగరం జట్టుపై ప్రకాశం, నెల్లూరుపై కడప, పశ్చిమగోదావరిపై విశాఖ, పశ్చిమ గోదావరి జట్టుపై తూర్పు గోదావరి జిల్లా జట్లు విజయం సాధించాయి.

Updated Date - Nov 23 , 2025 | 12:34 AM