వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:53 PM
జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశించారు.
అధికారులకు ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశం
పాడేరు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆదేశించారు. జిల్లా అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గిరిజన రైతులకు లబ్ధి చేకూరే ఈ-క్రాప్ నమోదుపై దృష్టి సారించాలని, అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. గడువు నాటికి ఈ-క్రాప్ నమోదు పూర్తి చేయాలని, అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. అలాగే ఈ-క్రాప్ నమోదుతో పంటల బీమా, కరువు నష్టాల పరిహారం, తదితర ప్రయోజనాలు చేకూరుతాయనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పీఎం కిసాన్ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు వీఆర్‌వో స్థాయి నుంచి తహశీల్దార్ స్థాయి వరకు కృషి చేయాలన్నారు. అటవీ హక్కు పత్రాలు పొందిన గిరిజన రైతులకు సైతం బ్యాంకు రుణాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని, ఈ ప్రక్రియను గ్రామ సచివాలయాల ద్వారా చేపట్టాలన్నారు. రైతులు దళారుల బారినపడి నష్టపోకుండా వారి పంటలకు మద్దతు ధర దక్కేలా చూడాలని సూచించారు. జిల్లాలో అవకాడో, లిచీ వంటి పండ్ల మొక్కల పంపకాన్ని ప్రోత్సహించాలని, రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశుసంపదల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి రైతుల ఆదాయం పెంచేలా చూడాలన్నారు. ఎరువుల విక్రయాలు, ధరలపై అధికారులు తరచూ పర్యవేక్షించాలని, అధిక ధరలకు విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజనకు అర్హులైన వారిని గుర్తించి, నమోదు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, జిల్లా ఉద్యాన వనాధికారి కె.బాలకర్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి.మురళి, డ్వామా పీడీ డాక్టర్ విద్యాసాగర్, జిల్లా పట్టుపరిశ్రమ అధికారి అప్పారావు, జిల్లా పశు సంవర్థకశాఖాధికారి జయరామ్, జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ మాతునాయుడు, తదితరులు పాల్గొన్నారు.