Share News

గిరిజనాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:06 AM

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఐటీడీఏ నూతన పీవో తిరుమని శ్రీపూజ అన్నారు. ఐటీడీఏ పీవోగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు.

గిరిజనాభివృద్ధికి కృషి
పాడేరు ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీపూజ

ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించిన తిరుమని శ్రీపూజ

పాడేరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఐటీడీఏ నూతన పీవో తిరుమని శ్రీపూజ అన్నారు. ఐటీడీఏ పీవోగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. గిరిజనాభివృద్ధికి కృషి చేస్తానని, స్థానిక పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గిరిజనులకు పక్కాగా అందేలా చర్యలు చేపడతామన్నారు. గిరిజనులకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, కలెక్టర్‌ మార్గదర్శకంలో అందరి సహకారంతో గిరిజనులకు చక్కని సేవలందిస్తానన్నారు. ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీపూజను డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, పరిపాలనాధికారి ఎం.హేమలత, మేనేజర్‌ పరంజ్యోతి, సిబ్బంది కలిసి పుష్ఫగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఐటీడీఏలో పరిస్థితులను సీనియర్‌ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు ఆమెకు వివరించారు. అనంతరం ఆమె కార్యాలయంలోని అన్ని విభాగాలను సందర్శించి, ఆయా సిబ్బందిని పరిచయం చేసుకున్నారు.

మోదకొండమ్మ దర్శనం, కలెక్టర్‌తో భేటీ

పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్‌ సోమవారం తొలుత స్థానిక మోదకొండమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మొక్కలను అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిస్థితులపై శ్రీపూజ, స్మరణ్‌రాజ్‌లతో కలెక్టర్‌ కాసేపు చర్చించారు. ఈ క్రమంలో వారిద్దరికీ కలెక్టర్‌ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గిరిజనుల కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని శ్రీపూజ, స్మరణ్‌రాజ్‌లకు కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Sep 09 , 2025 | 01:06 AM